పెట్రేగిపోతున్న అల్లరి మూకలు
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:52 PM
జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న దాడులు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మద్యం, గంజాయి మత్తులో, పాత కక్షలు, ఆస్తి తగాదాలు, భూ పంచాయతీలపై పరస్పర దాడులు జరుగుతున్నాయి. రాజకీయంగా సైతం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వరుస సంఘటనలతో శాంతిభద్రతలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
మంచిర్యాల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం అల్లరిమూకలకు అడ్డాగా మారింది. భూముల సెటిల్‌మెంట్లు, గొడవల్లో మారణాయుధాలతో హల్‌చల్ సృష్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల వరుసగా జరుగుతున్న పలు సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జూదం, వ్యభిచారం, సెటిల్‌మెంట్లు, గంజాయి వినియోగం, మారణాయుధాల వాడకంనిత్యకృత్యమైంది. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అక్రమార్కులు వచ్చి అక్రమ దందాలు కొనసాగిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని మారణాయుధాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బహిరంగంగా కత్తులు, తల్వార్‌లు, ఇతర మారణాయుధాలతో సంచరిస్తున్నా ప్రశ్నించేవారు కరువయ్యారు. సంఘనలు జరిగి, ఫిర్యాదులు అందితే తప్ప పోలీసులు స్పందిస్తున్న దాఖలు అరుదుగా కనిపిస్తున్నాయి.
దాడులతో భయానక వాతావరణం
జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ నాటి నుంచి మంచిర్యాల నగరం అభివృద్ధి చెందుతోంది. జిల్లాలోని ఇతర పట్టణాలు, పరిసర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు జిల్లా కేంద్రంలో స్థలాలు కొనుగోలు చేస్తూ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఇదిలా ఉండగా అసాంఘిక కార్యక్రమాలు కూడా అంతే వేగం పుంజుకున్నాయి. జన సంచారం పెరుగుతుండటంతో అక్రమ దందాలు కూడా అడ్డగోలుగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రభుత్వ స్థలాలు, పట్టా భూములను కబ్జా చేయడం, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టడం, ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురి చేసే సంఘటనలు పెరుగుతు న్నాయి. సెటిల్‌మెంట్ల పేరుతో వివాదాల్లో తలదూరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
వరుస దాడులతో ప్రజలు బెంబేలు
జిల్లా కేంద్రంలో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అవసరమైతే ప్రత్యర్థి వర్గాలను మట్టుబెట్టేందుకూ వెనకాడటం లేదు. పట్టపగలు మారణాయుధాలతో తిరుగుతూ ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారు. కొద్ది రోజులుగా పట్టణంలో ఏకంగా గ్యాంగ్ వార్‌లు జరుగుతుండటంతో అలజడి చెలరేగుతోంది. ఐబీ చౌరస్తా, బైపాస్ రోడ్డు, హమాలివాడ, తదితర ప్రాంతాల్లో జరిగిన తగాదాల్లో కత్తులు, తల్వార్లు వినియోగించడం పరిస్థితికి అద్ధం పడుతోంది. నేరాలు అదుపు తప్పుతుండగా, శాంతిభద్రతల నిర్వహణ పోలీసులకు సవాలుగా మారింది. వివిధ సంఘటనలకు సంబంధించి పోలీసులు పలువురు నేర చరిత ఉన్న వాళ్లను అరెస్టు చేసి, జైలుకు పంపుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
మచ్చుకు కొన్ని ఘటనలు...
-పట్టణంలోని తిలక్‌నగర్‌లో బతుకమ్మ సంబరాల సందర్భంగా జరిగిన దాడుల్లో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు.
-హమాలివాడ సప్తగిరి కాలనీలో యువకుడిపై స్థానికులు కొందరు దాడి చేశారు.
-అశోక్‌రోడ్డులో దుర్గామాత నిమిజ్జనం సందర్భంగా డీజే సౌండ్ విషయంలో యువకుడి పలువురు దాడి చేసి కొట్టారు.
-ఈ నెల 10న హమావాలివాడలో భూమి విషయంలో తల్వార్‌తో చంపేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో మంథని సమీపంలో జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి పాల్గొనడం ప్రకంపనలు సృష్టించింది. అతనితోపాటు పాల్గొన్న పలువురు వ్యక్తులకు నేర చరిత్ర ఉండటంతో స్థానికంగా సంచలనం సృష్టించింది.
-ఈ నెల 14న రాత్రి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఇంటిలోకి ముగ్గురు ముసుగు ధరించిన వ్యక్తులు కత్తులతో చొరబడ్డారు. వాచ్‌మన్ అడ్డుపడటంతో అతనిపై దాడి చేసి పరారయ్యారు.