పోలీసు అమరుల త్యాగాలు అజరామరం
ABN , Publish Date - Oct 21 , 2024 | 10:53 PM
పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరమని, అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 21 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలు అజరామరమని, అమరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సీపీ, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ సి.రాజు అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత్-చైనా సరిహద్దున సియాచిన్ ప్రాంతంలోని భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా రక్షణ బలగాలు యత్నించగా 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారి జ్ఞాపకార్థం యేటా అక్టోబర్ 21న అమరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, వ్యవస్థ సాఫీగా నడవాలంటే పోలీసులది కీలకపాత్ర అన్నారు. అమరులైన పోలీసుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత మెరుగైన సేవలందిస్తామన్నారు. పది రోజులపాటు పోలీసుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను చేపడుతామన్నారు. అమరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, పెద్దపల్లి, మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు జి.కృష్ణ, ఆర్.ప్రకాష్, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్, ఏఆర్ ఏసీపీలు నరసింహులు, మల్లారెడ్డి, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్ (ఆంధ్రజ్యోతి): గుడిపేట 13వ బెటాలియన్‌లో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుని స్మృతి పరేడ్ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు అమరవీరుల స్తూపం వద్ద కమాండెంట్ వెంకటరాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమర పోలీసులు చేసిన సేవలను కొనియాడారు. అసిస్టెంట్ కమాండెంట్‌లు నాగేశ్వర్‌రావు, కాళిదాసు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్‌సింగ్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
మందమర్రి టౌన్, (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి గౌరవ వందనం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఆస్తుల రక్షణ, శాంతి భధ్రతల కోసం పోలీసులు పని చేస్తున్నారని, ఒక్కో సందర్భంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని పేర్కొన్నారు. వారి సేవలను స్మరిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్, కాసిపేట, రామకృష్ణాపూర్, దేవాపూర్ ఎస్సైలు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్ (ఆంధ్రజ్యోతి) : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ఏఆర్ ఏసీపీ సుందర్‌రావు, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ అప్జలుద్దీన్, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య, తాండూర్ సీఐ కుమారస్వామి, తాళ్లగురిజాల ఎస్‌ఐ రమేష్, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.