కోనోకార్పస్ మొక్కలతో ముప్పే..!
ABN , Publish Date - Nov 30 , 2024 | 10:48 PM
పచ్చదనం కోసం పట్టణాల్లోని రోడ్డు డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువ య్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమ వుతున్న ఈ మొక్కలను తొలగించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
మంచిర్యాల, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పచ్చదనం కోసం పట్టణాల్లోని రోడ్డు డివైడర్ల మధ్య పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు ఆరోగ్యరీత్యా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు కరువ య్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమ వుతున్న ఈ మొక్కలను తొలగించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఏపుగా పెరుగుతున్న ఈ మొక్క లు వాటి పరిసరాల్లో మరే ఇతర మొక్కలను పెరగనివ్వకుండా పర్యావరణానికి హాని కలిగించడమేగాక, మను షులు, జంతువులకు కూడా హానికరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చెట్ల మీద పక్షులు వాలడం, గూళ్లు కట్టుకోవడం కూడా చేయవని, నిత్యం జనసం చారం కలిగిన చోట్లలో వాటిని పెంచుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహ దారుల వెంట, పట్టణాల్లోని రోడ్ల మధ్య ఉన్న డివైడర్లలో కోనోకార్పస్ మొక్కలు విరివిగా దర్శనమిస్తాయి.
పుప్పొడి రేణువులతో ప్రమాదం
కోనోకార్పస్ మొక్కలు పూతకు వచ్చినప్పుడు వాటి నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమాతోపాటు లంగ్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఈ మొక్కలను తొలగించాలని గత ప్రభుత్వ హయంలోనే అధికారులు నిర్ణయించినప్పటికీ చర్యలు చేపట్టలేదు. జిల్లా కేంద్రంలోని ఐబీ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు రోడ్డు డివైర్‌లో ఉన్న చెట్లను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక దఫా నరికివేసినప్పటికీ, మళ్లీ అవి ఏపుగా పెరిగాయి.
భూగర్భ జలాలపైనా ప్రభావం
కోనోకార్పస్ మొక్కలు ప్రత్యక్షంగా మానవుల ఆరో గ్యంపై ప్రభావం చూపడమేగాకుండా పరోక్షంగా భూగర్భ జలాలపైనా ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరి స్తున్నారు. కోనోకార్పస్ మొక్క వేర్లు కిలోమీటర్ల మేర భూమి లోతుల్లోకి పాతుకుపోయి నీటిని అధికంగా వినియోగిస్తాయి. ఈ మొక్కలు అధికంగా ఉండే సమీప ప్రాంతాల్లో బోర్లలో నీరు లోతుల్లోకి వెళుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. తద్వారా భూగర్భ జలాలు అడుగంటుతాయి. కోనోకార్పస్ మొక్కలకు బదులుగా ఇతర మొక్కలను నాటాలని సూచించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యావరణానికి హాని కలిగించే మొక్కల నుంచి ప్రజలకు, జంతువులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
డా.కుమారస్వామి, మెడిలైఫ్ ఆస్పత్రి ఛాతి వైద్య నిపుణులు
కోనోకార్పస్ మొక్కల కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆకుల నుంచి వెలువడే పరాగ రేణువులతో ప్రమాదకర అలర్జీ వస్తుంది. ఆస్తమా అధికం అవుతుంది. ఊపిరితిత్తుల వ్యాధులు తలెత్తు తాయి. కళ్ల కలక, దద్దుర్లు, వాపులు సంభవిస్తాయి. టీబీ రోగులకు అత్యంత ప్రమాదకరం. కోనోకార్పస్ మొక్కల వేరు నుంచి మొదలుకొని కాండం, ఆకుల వరకు కూడా మానవాళికి ప్రమాదమే.
విషపు మొక్కలను తొలగించాలి
గుండేటి యోగేశ్వర్, పర్యావరణ వేత్త
మానవాళికి విషమంగా తయారైన కోనోకార్పస్ మొక్కలను అధికారులు తొలగించాలి. వీటి ఆకులను పశువులు కూడా తినవు. ప్రధాన రహదారుల మధ్య డివైడర్లలో ఎక్కడ చూసినా కోనోకార్పస్ మొక్కలే దర్శనమిస్తున్నాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రదేశాల్లో నాటడం వల్ల ప్రమాదం పొంచి ఉంది.