మంచిర్యాల డివిజన్‌లో పెద్దపులి సంచారం
ABN , Publish Date - Nov 05 , 2024 | 10:55 PM
మంచిర్యాల ఫారెస్టు డివిజన్ పరిధిలోకి పెద్దపులి వచ్చింది. ఆదివారం సాయంత్రం ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడకు చెందిన గిరిజన రైతు చిత్రు ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులను చంపింది. దీంతో పెద్దపులి వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి ఎస్ 12 మగ పులిగా అధికారులు భావిస్తున్నారు.
కాసిపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల ఫారెస్టు డివిజన్ పరిధిలోకి పెద్దపులి వచ్చింది. ఆదివారం సాయంత్రం ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడకు చెందిన గిరిజన రైతు చిత్రు ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులను చంపింది. దీంతో పెద్దపులి వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి ఎస్ 12 మగ పులిగా అధికారులు భావిస్తున్నారు. నాలుగు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్ కుమరంభీంజిల్లా సిర్పూర్ టీ అడవుల్లోకి ప్రవేశించి కవ్వాల్ టైగర్ జోన్‌లోని ఖానాపూర్, పెంబి అటవీ క్షేత్రాల పరిధిలో సంచరించింది. ఇటీవల హాజీపూర్ అటవీ శివారు ప్రాంతంలో కనిపించిన పులి మూడు రోజుల క్రితం మేడారం, బొక్కలగుట్ట, ముత్యంపల్లి, ర్యాలీగడ్‌పూర్, గురువాపూర్, దేవాపూర్ అటవీ శివారు ప్రాంతాల్లో కనబడినట్లు కొందరు పశువుల కాపర్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆవుల మందపై దాడి చేయడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పత్తి రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. వేటగాళ్ళు ఉచ్చుల నుంచి పెద్దపులిని కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆహారం, నీరు, సురక్షిత ఆవాసం దొరికే వరకు పులి అడవి అంతా తిరుగుతుందని, పులికి హాని తలపెట్టవద్దని గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల ఎఫ్‌డీవో సర్వేశ్వర్ మాట్లాడుతూ మంచిర్యాల డివిజన్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని, పులిని సంరక్షించుకోవడం అందరి బాద్యత అన్నారు. పులి రోజుకు 60 కిలోమీటర్లు నడుస్తుందని, సురక్షిత స్థిర నివాసం ఏర్పర్చుకునే వరకు అడవంతా తిరుగుతుందన్నారు. సమీప గామాల ప్రజలు, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. పులి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆవులకు నష్టపరిహారం అందజేత
ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని మామిడిగూడలోని గోండుగూడ అటవీ శివారు ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపింది. లక్షెట్టిపేట రేంజ్‌లోని మేడారం సెక్షన్ పరిధిలోని అటవీ శివారు ప్రాంతంలోని మేతలకు వెళ్లిన ఆవుల మందపై దాడి చేసింది. దాడిని గుర్తించిన లక్షెట్టిపేట ఎఫ్‌ఆర్‌వో సుభాష్ ముత్యంపల్లి డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వో నవీన్‌నాయక్‌లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పశువైద్యాధికారి తిరుపతి పంచనామాచేసిన అనంతరం పులి దాడి చేసి చంపినట్లు గుర్తించారు. దీంతో ఆవుల యజమాని చిత్రుకు మంచిర్యాల అటవీ శాఖ అధికారులు రూ. 33 వేల నష్టపరిహారాన్ని మంగళవారం అందజేశారు. ఎఫ్‌ఎస్‌వో అహ్మద్ ఆలీ, ఎఫ్‌బీవో శ్రీనివాస్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.