పెద్ద ధర్మారం సమీపంలో పెద్దపులి
ABN , Publish Date - Nov 09 , 2024 | 10:44 PM
కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపిన విషయం తెలిసిందే.
కాసిపేట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపిన విషయం తెలిసిందే. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పెద్ద ధర్మారం గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పంటచేన్లలో కాపలా ఉన్న కొందరికి పెద్దపులి అరుపులు వినిపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పత్తి పంట చేతికి రావడంతో పులి భయంతో పత్తి తీసేందుకు కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెద్దపులి రావడంతో అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు ట్రాకింగ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులికి ఎలాంటి హానీ తలపెట్టకుండా ఉండేందుకు స్ధానిక అటవీ శివారు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.