Share News

నేడు గూడెంలో కార్తీక పౌర్ణమి మహాజాతర

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:15 PM

గూడెంగుట్టపై కొలువుదీరిన రమాసహిత సత్యనారాయణ ఆలయంలో శుక్రవారం జరిగే కార్తీక పౌర్ణమి మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు.

నేడు గూడెంలో కార్తీక పౌర్ణమి మహాజాతర

దండేపల్లి, నవంబరు14(ఆంధ్రజ్యోతి): గూడెంగుట్టపై కొలువుదీరిన రమాసహిత సత్యనారాయణ ఆలయంలో శుక్రవారం జరిగే కార్తీక పౌర్ణమి మహాజాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పలు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. వేలాది మంది దంపతులు స్వామి వ్రతాలను కింద, పైన వ్రత మండపాల్లో ఆచరిస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గుట్టపైకి ఎక్కడానికి ఒక దారి, దిగడానికి మరో దారి ఏర్పాటు చేశారు. బారికేడ్లు, భక్తులు సేద దీరేందుకు శామియనాలు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. సీఐ అల్లం నరేందర్‌, ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో ఆలయం, గోదావరి తీరం వద్ద సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ అల్లం నరేందర్‌ తెలిపారు.

జాతరకు ఏర్పాట్లు పూర్తి

ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌

కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం గూడెం ఆలయంలో జాతరకు ఏర్పాట్లు పూర్తి చేరసినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా షామియనా, తాగునీరు ఏర్పాటు చేశాం. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. జాతరకు సుమారు లక్ష వరకు భక్తులు వస్తారని అంచనా. ఘాట్‌రోడ్డు నుంచి క్యూలైన్లు, గుట్టపైకి ఎక్కడానికి ఒక దారి, దిగడానికి మరో దారి ఏర్పాటు, క్యూలైన్ల కోసం బారికేడ్లు, గుట్ట కింద, పైన ప్రధానాలయం పక్కన వ్రత మండపాలను ఏర్పాటు చేశాం. ఆలయ సిబ్బంది, సేవ సమితితో పాటు మరో 200 మంది పోలీసు సిబ్బందిని సేవలందిస్తారు. ప్రధానాలయం పక్కన రూ. 1500, గుట్ట కింద వ్రతాలు ఆచరించే వారు రూ. 600 చెల్లించాలి. భక్తులు పూలు పండ్లు, మంగళహారతి, ఇతర అలంకరణ వస్తువులు వెంట తెచ్చుకోవాలన్నారు. భక్తుల కోసం 30 వేలపైగా లడ్డు, 20వేల పులిహోరలను సిద్ధం చేస్తున్నాం. ఆలయానికి వచ్చే భక్తులకు దేవస్ధానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం.

Updated Date - Nov 14 , 2024 | 11:15 PM