నేడు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:43 PM
సమాజంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు.
బెల్లంపల్లి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సమాజంలో శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటారు. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను అర్పిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలో పలువురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
నేపథ్యం
1959 అక్టోబర్ 21న భారత జవాన్‌లు జమ్ముకాశ్మీర్ రాష్ట్రం లడక్ జిల్లాలోని లెహ్ ప్రాంతంలో బందోబస్తులో ఉన్నారు. చైనా సైనికులు భారత జవాన్‌లపై దాడి చేయడంతో 11 మంది జవాన్‌లో మృతిచెందారు. వారి మృతదేహాలను తీసుకువచ్చే వీలు లేకపోవడంతో జవాన్‌ల మృతదేహాలను అక్కడే ఖననం చేశారు. కుటుంబీకులు వారిని కడసారి చూపునకు సైతం నోచుకోలేదు. అసువులు బాసిన జవాన్‌ల ఆత్మలకు శాంతి కలగాలని యేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
జిల్లాలో విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణత్యాగం
శాంతి భధ్రతల పరిరక్షణలో పోలీసులు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 1996 జూన్ 23న సీసీసీ నస్పూర్ కాలనీలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో శ్రీరాంపూర్ సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్‌లు మరణించారు. 1998లో మే 28న బెల్లంపల్లిలో విధి నిర్వహణలో ఉన్న ఐడీ పార్టీ పోలీసులు శేషు, సంజీవ్‌లను మావోయిస్టులు తుపాకులతో కాల్చి చంపారు. సికాస, మావోయిస్టుల కాల్పుల్లో ఏఎస్‌ఐ సీహెచ్ మదన్‌మోహన్, హెడ్ కానిస్టేబుల్ ఎండీ జహీరుద్దీన్, కానిస్టేబుల్ సుధాకర్‌లు మృతిచెందారు. వీరితో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1996 నవంబర్ 15న సిర్పూరు యు పోలీస్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చి వేసిన ఘటనలో ఎస్‌ఐ అహ్మద్ షరీఫ్‌తో పాటు 12 మంది పోలీసులు చనిపోయారు. మందమర్రిలో పోలీసు అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు.
నేటి నుంచి 31 వరకు పోలీసుల సంస్మరణ కార్యక్రమాలు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్ హౌజ్ నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ నుంచి ఎఎస్‌ఐ స్ధాయి అధికారి వరకు పోలీసులకు వ్యాసరచన పోటీలు (సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగు పర్చడం), ఎస్‌ఐ స్ధాయి నుంచి ఆపై అధికారులకు (ధృడమైన శరీరంలో ధృడమైన మనసు) వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజన్‌లు, పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీలు, అమరులకు నివాళులర్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. పోలీసు కళాబృందాలతో ఈ నెల 31 వరకు ప్రధాన కూడళ్ల వద్ద కళాజాత చేపట్టనున్నారు.