Share News

కులగణనపై అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:04 PM

కులగణనపై అన్ని కుల సంఘాల నాయకులు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని కుల సంఘాలతో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

కులగణనపై  అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం

మంచిర్యాల అర్బన్‌, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): కులగణనపై అన్ని కుల సంఘాల నాయకులు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌హాల్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని కుల సంఘాలతో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వే ద్వారా కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి స్థితిగతులను తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఆ కుటుంబాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను అందించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకే ఈ సర్వేను చేపట్టనుందని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సర్వేపై కుల సంఘాల నాయకులు వారి వారి అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, నస్పూర్‌ చైర్మన్‌ సురిమిల్ల వేణు, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

గర్మిళ్ల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్చంద్రరెడ్డితో కలిసి వార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్‌, కరీంనగర్‌ లాంటి ప్రాంతాల్లో అందిస్తున్న వైద్య సేవలను త్వరలోనే మంచిర్యాలలో అందుబాటులోకి తీసుకువస్తానని, ఐబీలో నిర్మించే ఆసుపత్రిని ఆరు నెలల్లో పూర్తి చేసి ఎంసీహెచ్‌ను ఇక్కడకు తరలిస్తామని తెలిపారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ శ్రీమన్నారాయణ, ఏసీపీ ప్రకాష్‌, సీఐ ప్రమోద్‌రావు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధి కోసమే ఆక్రమణల తొలగింపు

మంచిర్యాల అర్బన్‌, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసేందుకే మార్కెట్‌లోని ఆక్రమణలను తొలగిస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం మార్కెట్‌ను అధికారులు, నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం లైబ్రెరికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదువుకొని ప్రభుత్వ కొలువులు సాధించాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ అక్రమణల తొలగింపుతో రోడ్లన్నీ విశాలంగా మారాయని, త్వరలో రోడ్లను నిర్మించడంతోపాటు సెంటర్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్రమలను తొలగించిన వ్యాపారస్తులందరికి ధన్యవాధాలు తెలిపారు. అవకాశం ఉంటే వారందరికి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. వైస్‌ చైర్మన్‌ సల్ల మహేష్‌, మున్సిపల్‌ కమీషనర్‌ మారుతీ ప్రసాద్‌, టీసీఎస్‌ శ్యామ్‌సుందర్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:04 PM