Share News

ఆరు గ్యారంటీలు అమలయ్యేదెప్పుడు

ABN , Publish Date - Nov 08 , 2024 | 10:19 PM

ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అనంతరం వాటి అమలును విస్మరించిందని, ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారంశ్రీకృష్ణ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన జిల్లా పార్టీ మూడో మహాసభలకు ఆయన అతిథిగా హాజరయ్యారు.

ఆరు గ్యారంటీలు అమలయ్యేదెప్పుడు

మందమర్రిటౌన్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అనంతరం వాటి అమలును విస్మరించిందని, ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు తెలపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారంశ్రీకృష్ణ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన జిల్లా పార్టీ మూడో మహాసభలకు ఆయన అతిథిగా హాజరయ్యారు. ముందుగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం తప్ప ఇతర హామీలు అమలు కాలేదన్నారు. అధికారంలోకి రావడం కోసం అన్ని పార్టీలు హామీలు ఇవ్వడం గెలిచిన తర్వాత మర్చిపోవడం సాధారణమైందన్నారు. జిల్లాలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. గత పాలకులు కాసుల కోసం కక్కుర్తి పడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని అది పగుళ్లు తేలి పనికి రాకుండా పోయిందన్నారు.

ఈ ప్రాజెక్టులో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై విచారణ వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు తుమ్మిడిహట్టిలో నిర్మాణం చేస్తే నీటి ఇబ్బందులు ఉండేవి కావని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు రావడం లేదన్నారు. కేంద్రం పెట్టుబడిదారులకు పెద్ద పీట వేస్తూ సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. జాతీయ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తూ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. పోరాటాలతోనే హక్కులు సాధ్యమవుతాయన్నారు. జిల్లా కార్యదర్శి సంకె రవి, నాయకులు పైళ్ల ఆశయ్య, కనికరం అశోక్‌, దాసరి రాజేశ్వరి, ఎర్మ పున్నం, సత్యనారాయణ, కమలకుమారి, నర్సింగరావు, దూలం శ్రీనివాస్‌, దుంపల రంజిత్‌కుమార్‌,బోడెంకి చందు, అశోక్‌, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 10:19 PM