Share News

పత్తి కొనుగోళ్లు ప్రారంభించేది ఎప్పుడు....?

ABN , Publish Date - Oct 21 , 2024 | 10:55 PM

పత్తి రైతులు పరేషాన్‌లో పడ్డారు... సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు... ప్రైవేట్‌ వ్యాపారులు పెట్టిన ధరకు విక్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో పత్తి తడిస్తే తేమ పేరిట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

పత్తి కొనుగోళ్లు ప్రారంభించేది ఎప్పుడు....?

మంచిర్యాల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లు ప్రారంభిం చడంలో సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) జాప్యం చేస్తోంది. పంటను ప్రైవేటులో అమ్ముకుంటున్న రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అక్టోబరులోనే పత్తి పంట చేతికి రావడం ప్రారంభమవుతుండగా, ఇప్పటి వరకు కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించలేదు. మరో మూడు వారాలు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలున్నాయి. అక్టోబరు, నవంబరు మాసాల్లో పత్తి తడిస్తే తేమ పేరిట వ్యాపారులు తక్కువ చెల్లిస్తారని, కొనుగోలుకు సీసీఐ ముందుకు రాదని రైతులు పత్తిని ఏరుతారు. అక్టోబరులోనే సీసీఐ కొను గోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులకు మద్దతు ధర వచ్చే అవకాశముంది. సీసీఐ నవంబరులో కొనుగోలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పత్తి పగలడంతో విధిలేని పరిస్థితుల్లో పత్తి ఏరుతున్న రైతులు పైవ్రేట్‌ వ్యాపారులకే మద్దతు ధర రాకున్నా అమ్ముకుంటున్నారు.

వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు

పత్తి ఏరడం ప్రారంభించిన రైతులు ఇప్పటి వరకు అందిన పంటను పైవ్రేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని సీసీఐ కొనుగోళ్లకు వెనుకాడుతోంది. నవంబరు రెండో వారం నుంచి కొనుగోలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సీసీఐ నిబంధనల మేరకు పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు ధర లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో ఈ సంవత్సరం లక్షా 54వేల 249 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 15,42,490 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా. జిల్లాలో పండిన పత్తి పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలో ఏడు కొనుగోలు కేంద్రాలను అధికారులు గుర్తించారు. అయితే కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఆలస్యం కానున్న నేపథ్యంలో రైతులు ప్రైవేటు మార్కెట్‌పై ఆధారపడితే సీసీఐలో కొనుగోళ్లలో అంచనాలు తారుమారు కాగా, రైతులకూ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

సెప్టెంబరు నుంచే మార్కెట్‌లో కొత్త పత్తి

పత్తి సీజన్‌ ఇప్పటికే ప్రారంభంకాగా గత నెల నుంచే ఏరిన పత్తిని మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో వ్యాపారులు పెట్టిన ధరకు విక్రయిస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో ప్రైవేటు వ్యాపారులు గణనీయంగా ధరలు తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షాలు కురిస్తే ఏరిన పత్తి పాడయ్యే ప్రమాదం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అమ్ముకోవలసి వస్తోంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతోనే పైవ్రేట్‌ వ్యాపారులు పత్తికి మద్దతు ధర చెల్లించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు తెరిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వర్షాల కారణంగా చేసులో ఉన్న పత్తిని ఏరాలా లేక వదిలెయ్యాలా అని రైతులు సతమతమవుతున్నారు. పత్తి ఏరి మార్కెట్‌కు తీసుకువస్తే ధర వచ్చే పరిస్థితి లేదు. ఏరకుంటే చెట్టు మీది పత్తి వర్షాలకు తడిసి తేమ పెరగడంతోపాటు రంగు మారే ప్రమాదమున్నది. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ విషయంలో చొరవ చూపించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

సీసీఐ మద్దతు ధరలు ఇలా....

పత్తి పంటకు 2024-25లో సీసీఐ ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)లు ఇలా ఉన్నాయి. పత్తి పొడవు పింజ రకం రూ. 7521 ఉండగా, మధ్య రకం రూన. 7471, పొట్టి పింజ రకం రూ. 7421 ఉంది. అలాగే 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ. 7521, 9 శాతం ఉంటే రూ. 7445, 10 శాతం ఉంటే రూ. 7370, 11 శాతం ఉంటే రూ. 7295, 12 శాతం ఉంటే రూ. 7220 నిర్ణయించింది. పత్తి అమ్ముకునే రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ లింక్‌ ఉన్న మొబైల్‌ వెంట తీసుకెళ్లాలి. బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింకు తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.

Updated Date - Oct 21 , 2024 | 10:55 PM