ఫుడ్‌జోన్ పూర్తయ్యేదెన్నడు...?
ABN , Publish Date - Oct 06 , 2024 | 10:19 PM
గత ప్రభుత్వ హయాంలో నాలుగేండ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు కావడం, బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి, అక్టోబరు 6: గత ప్రభుత్వ హయాంలో నాలుగేండ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు కావడం, బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు, ప్రాంతం అభివృద్ధి చెందు తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. మంజూరై నాలుగేండ్లు అయినా పనులు పూర్తిస్ధాయిలో కాకపోవడం, మరో వైపు పరిశ్రమల స్ధాపనకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అందుబాటులోకి వస్తే స్థానికు లకు ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పలువురు ఎదురు చూస్తున్నారు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- నత్తనడకన పనులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ ఫ్రాసెసింగ్ జోన్‌ను బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు శంకుస్ధాపన చేశారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక సర్వే నెంబరు 170లో 350 ఎకరాల స్థలాన్ని సంబంధిత అధికారులు కేటాయించారు. ఈ స్థలంలో పరిశ్రమల కోసం రహదారులు, వంతెనలు నాణ్యతతో నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వరదలకు రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. అనంతరం దాదాపు రూ.50 కోట్ల నిధులతో ఫుడ్ జోన్ల ఏర్పాటు చేసే పరిశ్రమలకు 100 ఫీట్ల రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు వివిధ నిర్మాణ పనులను సైతం చేపట్టారు. పరిశ్రమల కోసం చేసిన పనులే మళ్లీ మళ్లీ చేయడంతో నిధులు నీళ్ల పాలు కావడంతోపాటు మరో వైపు సమయం వృథా అయ్యింది. పరిశ్రమ లు ఏర్పాటు చేయాలంటే ఫుడ్‌జోన్ ప్రాంతంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది. దీంతోపాటు డ్రైనేజీలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. పరిశ్రమల కోసం నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాలను శుద్ధి చేసే ప్లాంటుతో పాటు ఘన వ్యర్ధాల నిర్వహణకు అనువైన షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇందులో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఇలా నాలుగేండ్లుగా నామమాత్రంగానే ఫుడ్జోన్కు సంబంధిం చిన పనులు నడుస్తున్నాయి.
-వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా...
జిల్లాలో రైతులు పండించే పంటల ఉత్పత్తుల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను మొదట ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. జిల్లాలో ఎక్కువగా రైతులు వరి, పత్తి, పప్పు దినుసులు, మామిడి సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ పంటలకు అనుగుణంగా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రైతులు ఉత్పత్తి చేసిన పంటలతో స్ధానికంగానే ఆహార ఉత్పత్తి జరగనుంది. రైతులు పండించిన పంటలను ఫుడ్‌జోన్‌లో ఏర్పడే పరిశ్రమలకు తర లించి ఆహార ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఫుడ్‌జోన్ అందుబాటులోకి రాకపోవడంతో స్ధానికంగా పండించిన పం టలను ఇతర ప్రాంతాలకు రైతులు తరలిస్తున్నారు. ఫుడ్జోన్ను త్వరగా అందుబాటులోకి తెస్తే స్ధానిక రైతులతో పాటు పక్కనున్న జిల్లా రైతులకు మేలు జరుగుతుంది.
-పరిశ్రమల స్ధాపనకు ముందుకు రాని వైనం...
పట్టణంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌జోన్‌లో పరిశ్రమల ఏర్పాటుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఎవరు ముందుకు రావడం లేదు. రైసుమిల్లులతోపాటు బియ్యం వినియోగించి తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు, పప్పు ధాన్యాల ఉత్పత్తులు, సోయాబీన్, జిన్నింగ్ మిల్లు ఇతర పరిశ్రమలకు ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించినప్పటికీ ఇద్దరు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాకపోవడం, పనులు సైతం నత్తనడకన నడుస్తుండడంతో ఫుడ్ జోన్‌పై నీలి నీడలు కుమ్ముకుంటున్నాయి. పరిశ్రమలు ఏర్పాటైతే స్ధానికులతోపాటు ఇతర ప్రాంతల వారికి ఎంతో మందికి ఉపాధి సైతం కలుగనుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిస్ధాయిలో పట్టించుకోవ డం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఫుడ్ జోన్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి ప్రారంభించే విధంగా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి
- పద్మజ, ఫుడ్ జోన్ జోనల్ మేనేజర్
పరిశ్రమల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావాలి. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఫుడ్‌జోన్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రహదారులు, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశాం. వ్యాపారులు దరఖాస్తులు చేసుకుంటే త్వరగా అందుబాటులోకి తీసుకువస్తాం.