అదృష్టం వరించేదెవరినో?
ABN , Publish Date - Oct 07 , 2024 | 10:49 PM
సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధుల కల సాకారం కానుంది. వారం రోజుల క్రితం డీఎస్సీ ఫలితాలతో జిల్లా అభ్యర్ధులు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సంబంధిత జిల్లా అధికారులు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు.
బెల్లంపల్లి, అక్టోబరు 7 : సుదీర్ఘ కాలంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధుల కల సాకారం కానుంది. వారం రోజుల క్రితం డీఎస్సీ ఫలితాలతో జిల్లా అభ్యర్ధులు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సంబంధిత జిల్లా అధికారులు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఈ నెల 9న హైద్రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికైన అభ్యర్ధులకు నియామక ఉత్తర్వులను అందించనున్నారు. ఎవరికి ఉద్యోగం వస్తుందోనని డీఎస్సీ అభ్యర్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
-తీరనున్న ఉపాధ్యాయుల కొరత
జిల్లాలో 288 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో ఉన్న 288 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 70, పీఈటీ 3, ఎస్‌జీటీలు 176, స్పెషల్ ఎడ్యుకేటర్ 23, బాషా పండితులు 16 పోస్టులకు సంబంధించిన పరీక్షలో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. డీఎస్పీ పోస్టుల భర్తీలో ఎస్‌జీటీ పోస్టులు అధికంగా ఉండడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఊరట కలుగనుంది.
డీఎస్సీ అభ్యర్థుల్లో ఉత్కంఠ
జిల్లాలో 288 పోస్టులకు 715 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో 663 మంది అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరయ్యారు. మిగిలిన 52 మంది వివిధ కారణాలతో హాజరు కాలేదు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు 1:3 నిష్పత్తి ప్రకారం నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగియడంతో ఎంపికైన అభ్యర్ధులకు ఈ మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం అందించనున్నారు. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఈనెల 9న హైద్రాబాద్‌లో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేశాం - డీఈవో యాదయ్య
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో డీఎస్సీ 2024కు ఎంపికైన అభ్యర్ధులను 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్లను పరిశీలించాం. వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దిశ నిర్ధేశం ప్రకారం జిల్లాలో నియామక ప్రక్రియ కొనసాగుతుంది.