ఇసుక కష్టాలు తీరేదెన్నడు...?
ABN , Publish Date - Aug 31 , 2024 | 11:06 PM
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరకక ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలు అగుపిస్తున్నాయి. ఇసుక లేక ఇంటి నిర్మాణాలు ఆగిపోవడంతో కూలీలకు ఉపాధి దొరకడం లేదు.
బెల్లంపల్లి, ఆగస్టు 31: బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరకక ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలు అగుపిస్తున్నాయి. ఇసుక లేక ఇంటి నిర్మాణాలు ఆగిపోవడంతో కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఇంటి నిర్మాణాలపై పలు రంగాలకు సంబంధించిన కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జీవనోపాధి కోసం కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తున్నారు.
- భవన నిర్మాణ రంగం కుదేలు
నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, కాసిపేట మండ లాలకు నెన్నెల మండలం ఖర్జీలోని ఇసుక రీచ్ నుంచి ఇసుక వస్తోంది. ఆన్‌లైన్ పద్ధతి ద్వారా ఇసుకను సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు కేటాయిస్తారు. రోజు బెల్లంపల్లి మండలం, పట్టణానికి దాదాపు 200 ట్రిప్పులు, కాసిపేట, తాండూర్ మం డలాలకు 50 ట్రిప్పుల చొప్పున ట్రాక్టర్ యజమానులు ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకున్న వారికి ఇసుక రీచ్ ద్వారా సరఫరా చేస్తారు. సంబంధిత ట్రాక్టర్ యజమానులు ఇంటి యజమానులకు, బిల్డర్లకు నిర్ధేశించిన ధరలలో ఇసుకను సరఫరా చేస్తుంటారు. ఖర్జీ ఇసుక రీచ్ వద్ద నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఐదు ఫీట్ల ఎత్తులో నీటి నిల్వల కోసం వాగులో చెక్ డ్యాంను నిర్మించారు. ఇది సాధారణ ఎత్తు కంటే 5 ఫీట్ల ఎత్తులో నిర్మించడంతో చెక్ డ్యాం ముందు నీరు నిలు స్తుండడంతో ట్రాక్టర్లు నీటిలో దిగబడుతున్నాయి. దీంతో ట్రాక్టర్ యజమానులు ఇసుక సరఫరా చేయలేకపోతున్నారు. సంబంధిత మైనింగ్ అధికారులకు ట్రాక్టర్ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు చెక్ డ్యాంకు ముందు ఇసుక రీచ్ కు వెళ్ళే దారిలో తాత్కాలికంగా రహదారి నిర్మిస్తే ఇసుక రవా ణాకు ఆటంకం ఉండదని చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా ఆన్‌లైన్ ఇసుక బుకింగ్ లేకపోవడంతో ఇసుక సరఫరా చేయలేకపోతున్నారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల్లో 350కి పైగా ఇంటి నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. శ్రావణమాసం ముహూర్తాలు ఉండడంతో నూతనంగా ఇండ్లు నిర్మించే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
-ఉపాధి కరువై వలస బాట
ఇసుక సరఫరా లేని కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో ఇక్కడ పనిచేసే మేస్ర్తీలు, కూలీలు మంచిర్యాల జిల్లా కేంద్రానికి పనుల కోసం రోజు వెళ్తున్నారు. కాంటా చౌరస్తా వద్ద రోజు ఉదయం ఉపాధి కోసం మంచిర్యాలకు వెళ్తున్న కూలీలే కనిపిస్తున్నారు. మరికొందరు మంచిర్యాలకు వెళ్లలేక వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. మంచిర్యాలకు కూలీ కోసం వెళితే ఆరు నెలలు వరుసగా పనిచేస్తేనే పనులను కల్పిస్తామని మేస్ర్తీలు చెబుతుండడంతో ఇబ్బందులు పడుతు న్నారు. మంచిర్యాలకు వెళ్లి కూలీ పనులు చేస్తే రాను పోను చార్జీలతో గిట్టుబాటు కావడం లేదని పేర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని, ఇసుక సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.
సమస్య పరిష్కరించాలి
- రాంకుమార్, భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు
ఇసుక కొరత కారణంగా రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్నాం. నిర్మాణ రంగానికి సంబంధించి మేస్ర్తీలు, కూలీలు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు లేకపోవడంతో కొందరు మంచిర్యాలకు వెళ్తున్నప్పటికీ గిట్టుబాటు కూలీ రావడం లేదు. చేసేదేం లేక పనులు లేక కొందరు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇసుక సమస్యను త్వరగా పరిష్కరించాలి.