Share News

అక్రమ కట్టడాలపై చర్యలు కొనసాగేనా...?

ABN , Publish Date - Sep 21 , 2024 | 10:26 PM

జిల్లాలో ఎక్కడాలేని విధంగా అక్రమ కట్టడాలపై నస్పూర్‌ మున్సిపల్‌ అధికారులు తొలిసారి కొరఢా ఝళిపించారు. అధికారుల తీరుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా, జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగించాలనే డిమాండ్లు వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి.

అక్రమ కట్టడాలపై చర్యలు కొనసాగేనా...?

మంచిర్యాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడాలేని విధంగా అక్రమ కట్టడాలపై నస్పూర్‌ మున్సిపల్‌ అధికారులు తొలిసారి కొరఢా ఝళిపించారు. అధికారుల తీరుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండగా, జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగించాలనే డిమాండ్లు వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నాయి. నస్పూర్‌ ఘటనతో ’ఆంధ్రజ్యోతి’ కథనం అక్షర సత్యమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ’కొన్నది నాలుగెకరాలు... అమ్మింది ఆరెకరాలు’ శీర్షికన 2023 జూలై 8న ’ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురితమైంది. ఓ వ్యాపారి అక్రమంగా అమ్మిన రెండెకరాల స్థలంలోనే నస్పూర్‌లో అధికారులు కూల్చిన భవనం ఉండటం గమనార్హం.

ప్రభుత్వ భూమి ఆక్రమణ ఇలా....

నస్పూరు శివారు సర్వే నంబరు 40/అ, 40/ఆలో కొంత పట్టా భూమి ఉంది. అందులో నుంచి ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒక్కో సర్వే నెంబర్‌లో రెండెకరాల చొప్పున నాలుగు ఎకరాలను కొనుగోలు చేశాడు. అనంతరం దాన్ని విభజించి 2005 నుంచి 2010 వరకు విడుతల వారీగా విక్రయించాడు. ఇదిలా ఉండగా రెండు సర్వే నంబర్ల నుంచి నాలుగు ఎకరాలను అతడి భార్య పేరిట 2014లో గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశాడు. మొత్తం వ్యాపారి కొన్న స్థలం నాలుగు ఎకరాలు భార్య పేరిటే ఉండగా, అమ్మిన స్థలం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సదరు వ్యాపారి పట్టా భూమిని అనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్‌ 42లోని రెండెకరాలను గుట్టుచ ప్పుడు కాకుండా ఆక్రమించాడనే అభియోగాలు ఉన్నాయి. ఆ రెండెకరాలను ప్లాట్లుగా మార్చి విక్రయించాడు. సదరు స్థలంలోనే అధికారులు కూల్చిన ఐదంతస్థుల భవనం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ భూమి విక్రయ సమయంలో తన పట్టా భూమి నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది.

60 మందికిపైగా నోటీసులు జారీ....

మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్‌ 42లో ఆది నుంచి వివాదం నెలకొంది. అందులో మొత్తం 102 ఎకరాల స్థలం ఉంది. అందులో కొంత మొత్తాన్ని గతంలోనే కొన్ని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అసైన్‌ చేసింది. మిగతా భూమిలో 28 ఎకరాలను టీఎన్‌జీఓ సభ్యులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించినట్లు చెబుతున్నారు. అదిపోను మిగతా స్థలం కాలక్రమేణ కబ్జాలకు గురవుతూనే ఉంది. కలెక్టరేట్‌ను ఆనుకొని ఉండటంతో ప్రస్తుతం ఆ భూముల ధర ఎకరాకు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆ స్థలంలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన దాదాపు 60 మందికిపైగా రెండేళ్ల క్రితమే మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయిన కబ్జాల పర్వం ఆగకపోగా రోజు రోజుకూ విస్తరిస్తూనే ఉన్నాయి.

కబ్జాదారులపై చర్యలు ఉంటాయా...?

నస్పూర్‌ శివారు సర్వే నంబర్‌ 42లో అధికారులు నోటీసులు జారీ చేసిన అందరిపైనా చర్యలు ఉంటాయా...? అనే సందేహం ప్రజల్లో రేకెత్తుతోంది. ఐదంతస్థుల భవనం ఓ బీఆర్‌ఎస్‌ నాయకునికి చెందినది కావడంతో అధికా రులు కూల్చివేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అపవాదు పోవాలంటే అధికారులు నోటీసులు జారీ చేసిన వారందరిపైనా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనే అభియోగాలు మోయాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న వారిలో కనీసం పది మంది వరకు బడా బాబులు ఉన్నట్లు సమాచారం. వారిపైనా చర్యలు తీసుకుంటేనే అధికారుల పాత్ర పారదర్శకంగా ఉంటుందనే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం....

సతీష్‌, మున్సిపల్‌ కమిషనర్‌, నస్పూర్‌

మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్‌ 42లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూల్చి వేస్తాం. ఇప్పటి వరకు 60 మందికి పైగా నోటీసులు ఇచ్చాం. వారిలో కొందరు నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు. మిగతా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందిన ఆధారాలను పరిశీలించడంతోపాటు అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు కొనసాగుతాయి.

Updated Date - Sep 21 , 2024 | 10:26 PM