Share News

అనుమతులు లేకుండానే ఇళ్ళ నిర్మాణం

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:07 PM

ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనుమతులు తీసుకుంటాం. అనంతరం నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా నస్పూర్‌ మున్సిపాలిటీలో కట్టిన ఇళ్లకు నిర్మాణ అనుమతులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందిన వెంచర్‌లో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది.

అనుమతులు లేకుండానే  ఇళ్ళ నిర్మాణం

మంచిర్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనుమతులు తీసుకుంటాం. అనంతరం నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా నస్పూర్‌ మున్సిపాలిటీలో కట్టిన ఇళ్లకు నిర్మాణ అనుమతులు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఓ బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి చెందిన వెంచర్‌లో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. అంగబలం ఉన్న వారికి ఓ న్యాయం... సామాన్యులకు మరో న్యాయమా అంటూ అధికారుల వైఖరిని ఎండగడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా

నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లిలో సర్వే నెంబర్లు 16, 38, 39లో డీటీసీపీ లేఅవుట్‌ అను మతుల కోసం కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ మున్సిపల్‌ చట్టం 2019, టీఎస్‌ బీపాస్‌-2020 ప్రకారం టెంటేటివ్‌ అప్రోవల్‌తో వెంచర్‌లో అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. ఫైనల్‌ లే అవుట్‌ అప్రోవల్‌ రాకుండా ఎలాంటి నిర్మా ణాలు చేపట్టరాదు. అలా చేపట్టే నిర్మాణాలకు ఆయా సంస్థలు అనుమతులు జారీ చేయకూడదు. అయితే ఫైనల్‌ లే అవుట్‌ అనుమతులు రాకుండానే నాలుగు ప్లాట్లలో భవన నిర్మాణాలు చేపట్టారు. ఆ ఇళ్ల నిర్మా ణాలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. టెంటేటివ్‌ లే అవుట్‌ అనుమతులు పొందిన వెంచరు నిర్వాహకులు అందులో ప్రజల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి వసతి, పార్కు పనులు చేపట్టాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తయ్యే వరకు తామే బాధ్యులమంటూ వెంచరు స్థలం విస్తీర్ణంలో 15 శాతం భూమిని మున్సిపాలిటీ పేరిట మార్ట్‌గేజ్‌ చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారంటూ మున్సిపల్‌ అధికారులు నిర్ధారించుకున్న తరువాత మార్ట్‌గేజ్‌ స్థలాన్ని రిలీజ్‌ చేస్తారు. అప్పుడే వెంచర్లో భవన నిర్మాణాలు చేపట్టేం దుకు మున్సిపాలిటీ అనుమతులు లభిస్తాయి. ఈ విష యం టెంటేటివ్‌ లే అవుట్‌ అనుమతి పత్రంలో స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే సదరు టెంటేటివ్‌ లే అవుట్‌ అనువతులు కూడా రద్దవుతాయి. అందుకు భిన్నంగా ఫైనల్‌ లే అవుట్‌ రాకున్నా నిర్మాణం పూర్తి చేసుకున్న నాలుగు ఇళ్లకు నస్పూర్‌ మున్సిపల్‌ అధికారులు నిర్మాణ అనుమతులు జారీ చేయడం కొసమెరుపు.

డిస్ట్రిక్ట్‌ లే అవుట్‌ కమిటీ రిపోర్టు బుట్టదాఖలు....

డిస్ట్రిక్ట్‌ లే అవుట్‌ కమిటీ ఫీల్డ్‌ ఎంక్వయిరీ చేసి కలెక్టర్‌కు ఇచ్చిన ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌లో నాలుగు భవనా లను అక్రమంగా నిర్మించారని స్పష్టంగా పేర్కొన్నది. డిస్ట్రిక్‌ లే అవుట్‌ కమిటీ సభ్యులు వెంచర్‌లోని 11, 12, 13, 14 నెంబర్లుగల ప్లాట్లలో ఎటువంటి అనుమతులు లేకుండా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆగస్టులో కలెక్టర్‌కు రిపోర్టు ఇవ్వగా, ఆ తరువాత మున్సిపల్‌ అనుమతులు రావడం గమనార్హం.

ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌లో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నప్పటికీ నిర్మాణ అనుమ తులు జారీ అయ్యాయి. ఇదిలా ఉండగా డిస్ట్రిక్ట్‌ లే అవుట్‌ కమిటీ సభ్యులైన జిల్లా పంచాయతీ అధికారి, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు తమ ఎంక్వైరీ రిపోర్టును ఆగస్టు 6న కలెక్టర్‌కు అందజే శారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్‌ నెంబర్లు 11 నుంచి 14 వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టారని పేర్కొ న్నారు. అయినప్పటికీ అవే ప్లాట్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణ అనుమతులు సెప్టెంబరు 25న జారీ కావడం గమనార్హం. ఈ తతంగం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయమై నస్పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సతీష్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

నిర్మాణ అనుమతులు ఇలా.....

నస్పూర్‌ మున్సిపల్‌ అధికారులు పై నాలుగు ఇళ్లకు జారీ చేసిన నిర్మాణ అనుమతుల వివరాలు ఇలా ఉన్నాయి.

1. 428382/ఎన్‌ఏఎస్‌పీ/0221/2024, తేది 25-09-2024

2. 428394/ఎన్‌ఏఎస్‌పీ/0222/2024, తేది 25-09-2024

3. 428446/ఎన్‌ఏఎస్‌పీ/0223/2024, తేది 25-09-2024

4. 428459/ఎన్‌ఏఎస్‌పీ/0224/2024, తేది 25-09-2024

Updated Date - Nov 02 , 2024 | 11:07 PM