Share News

ధాన్యం కొనుగోలులో మహిళ సంఘాలు

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:01 PM

ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే మరో వైపు మహిళలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మహిళ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ మహిళలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ లాభాల బాట పడుతున్నారు.

ధాన్యం కొనుగోలులో మహిళ సంఘాలు

బెల్లంపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఓ వైపు కుటుంబ బాధ్యతలు చూస్తూనే మరో వైపు మహిళలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. మహిళ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ మహిళలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ లాభాల బాట పడుతున్నారు. తమకు సాధ్యం కానిది లేదనే రీతిలో ముందుకు సాగుతున్నారు. ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం సేకరిస్తూ కమీషన్‌ల రూపంలో ఆదాయం పొందున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

- యేటా ముందంజలో నిలుస్తూ....

ప్రభుత్వం యేటా ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాలతో పాటు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 10,300 ఉండగా గ్రామ సంఘాలు 355 ఉన్నాయి. మండల సమాఖ్యలు 16 ఉండగా జిల్లా సమాఖ్య 1 ఉంది. వీరి ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలో ఐకేపీ తరుపున మహిళా సంఘాల ఆధ్వర్యంలో 135 కేంద్రాలను నడిపారు. వీరు 12,770 మంది రైతుల నుంచి 8,41,350 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. అధికారులు, రైతులను సమన్వయం చేసుకుంటూ సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో రవాణా చేశారు. అన్నదాతల డబ్బులు ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.32 చొప్పున కమీషన్‌ సంఘాలకు అందించింది. దీంతో జిల్లాలో సేకరించిన ధాన్యానికి మహిళ సంఘాలకు రూ. 2.65 కోట్లు కమీషన్‌ అందుకున్నారు.

-18 సంవత్సరాల నుంచి కేంద్రాల నిర్వహణ

ప్రభుత్వం మహిళ సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు 2006లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారికి కేటాయించారు. గ్రామైఖ్య సంఘాల నుంచి కమిటీలను ఎన్నుకుని వారి ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన గ్రామాల్లో మహిళ సంఘాల నుంచి ఐదుగురిని నిర్వాహకులుగా ఎంపిక చేస్తారు.వీరికి జిల్లా కేంద్రంలో ఒక్కరోజు శిక్షణ ఇస్తారు. రైసుమిల్లర్లు అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు.

-ఈ యేడు ఖరీప్‌లో జిల్లాలో 148 కేంద్రాలు

ధాన్యం కొనుగోలుపై మహిళా సంఘాల్లో ఆసక్తి పెరుగుతుండడంతో అధికారులు సైతం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈయేడు జిల్లాలో 148 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు మహిళ సంఘాలు, అధికారులు సన్నద్ధమయ్యారు.

ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు

స్వప్న, బుచయ్యపల్లి, సంఘం అధ్యక్షురాలు

రైతులకు వారధిగా ఉంటూ ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం. యేటా కేంద్రానికి ధాన్యం వచ్చినప్పటి నుంచి తూకం వేసి మిల్లుకు తరలించే వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. కొనుగోలు ద్వారా వచ్చే కమీషన్‌తో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. రైతులకు మంచి సేవలు అందించడంతోపాటు ఆర్థిక తోడ్పాడుకు ఉపయోగపడుతుంది.

సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం

-అనూష, మహిళ సంఘం కార్యదర్శి

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి పూర్తయ్యే వరకు సమర్ధవంతంగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రైతులు సొంత గ్రామంలోనే ధాన్యం అమ్ముకునే వెసలుబాటు ఏర్పడుతుంది. ఈ విధానంతో రైతులకు లాభం కలుగుతుంది. దీంతో పాటు వచ్చే కమీషన్‌తో సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఆర్ధికంగా లాభ పడతాం.

మహిళలకు ప్రయోజనం

- కిషన్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో మహిళలు సమర్ధవంతంగా పనిచేస్తుండడంతో వారికి ప్రయోజనం చేకూరుతుండడంతో పాటు మంచి పేరు వస్తుంది. యేటా అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి లక్షలాది రూపాయల ఆదాయాన్ని మహిళలు పొందుతున్నారు. కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంతో రైతులు స్ధానిక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:01 PM