Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ABN , Publish Date - Dec 17 , 2024 | 06:13 AM
మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా నగదును అందించాల్సిన ఏఈవో.. బాధిత కుటుంబం నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని కాజేశాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గేటుతండాకు చెందిన రైతు బానోత్ ఈ ఏడాది జూన్ 9న మృతిచెందాడు.

కురవి, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా నగదును అందించాల్సిన ఏఈవో.. బాధిత కుటుంబం నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని కాజేశాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు గేటుతండాకు చెందిన రైతు బానోత్ ఈ ఏడాది జూన్ 9న మృతిచెందాడు. నామినీగా ఉన్న ఆయన భార్య బానోత్ ఇరానీ స్థానికుల సాయంతో రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 10న బీమా సొమ్ము 5లక్షలు ఇరానీ ఖాతాలో జమ అయినా ఆమెకు తెలియలేదు. ఆమె నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకున్న ఏఈవో బానోత్ కల్యాణ్ కొన్ని సంతకాలు చేస్తే నగదు వెంటనే చేతికొస్తాయని నమ్మించి చెక్కుపై సంతకం చేయించుకుని అక్టోబరు 19న ఇరానీ ఖాతాలో ఉన్న ఆ డబ్బును తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. నెల తర్వాత ఇరానీ గుండ్రాతిమడుగులోని బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా ఆమె ఖాతాలోని నగదు ఏఈవో కల్యాణ్ ఖాతాకు బదిలీ అయిందని అధికారులు తెలిపారు. దీనిపై ఏఈవో కల్యాణ్‌ను ప్రశ్నించగా.. వారం రోజుల్లో డబ్బు ఇస్తా అంటూ ఆయన ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. దీంతో బాధితురాలు కురవి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.