Sridhar Babu: పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:02 AM
పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని, పడగొట్టాలని కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
మూసీలో నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
దీనిపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
మల్లన్నసాగర్‌లో వారేం చేశారు?: శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని, పడగొట్టాలని కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మూసీ రివర్‌బెడ్‌లోని అక్రమ నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నామని.. నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత తమదని, వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించనున్నామని ఆయన వెల్లడించారు. భూనిర్వాసితులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎ్‌సకు లేదన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా కొత్త జీవోను తేవడంతో.. అప్పట్లో మల్లారెడ్డి అనే రైతు చితి పెట్టుకుని ఆహుతయ్యాడని గుర్తుచేశారు. సీఎల్పీ మీడియా హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే చెరువుల్లో, మూసీ నదిలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. మూసీ నదిలో గోదావరి నీళ్లను ప్రవహింపజేసి నదికి ఇరువైపులా రోడ్లు వేస్తామన్నారు. మూసీపైన ఫ్లై ఓవర్లు, పీపీపీ పద్ధతిలో నిర్మాణాలూ ఉంటాయని చెప్పారు. ‘వాక్ టు వర్క్’ పద్ధతిలో ఉపాధినీ కల్పిస్తామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని, దీనికి సంబంధించి 12 ఎన్జీవోల ప్రతినిధులతో సంప్రదింపులూ చేస్తున్నామని చెప్పారు. సొంత ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. అంగన్ వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని, వారి పిల్లలను ఆరేళ్ల పాటు చదివిస్తామని చెప్పారు. స్వయం సహాయక మహిళా గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామన్నారు.
హైడ్రాతో పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని.. బిల్డర్ల చేతిలో మోసపోయిన పేద, మధ్యతరగతి వారి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడబోదని, ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. మూసీ, హైడ్రాల విషయంలో అనుమానాల నివృత్తి కోసం అన్ని కలెక్టరేట్లలో హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ, హైడ్రాపై చట్టబద్ధంగా, ప్రణాళికాయుతంగా ముందుకు వెళుతున్నామని, నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పారు. అపార్ట్‌మెంట్ నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలనే అంశంపై సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని.. బిల్డర్ల చేతిలో మోసపోయిన వారి విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తుందని వెల్లడించారు.
బ్లూ ప్రింట్ సిద్ధం..
మూసీ ప్రాజెక్టుకు సంబంధించి బ్లూ ప్రింట్ తయారైదని, పనులు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మూసీ ప్రక్షాళన చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా చెప్పిందని, కానీ చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పని తమ ప్రభుత్వం చేస్తుంటే ఆ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. హైదరాబాద్ వాసులు మురికి కంపులోనే ఉండాలా అంటూ బీఆర్‌ఎస్ పార్టీని నిలదీశారు. ‘‘బుల్డోజర్ పాలసీని అమలు చేసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపైకే బుల్డోజర్ పోయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులు, మల్లన్న సాగర్ నిర్వాసితులపైకి బుల్డోజర్లు పోయాయి. మేము ప్రజాస్వామ్యస్ఫూర్తితో వెళుతుంటే..బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు.