Share News

సైదాబాద్‌లో.. మళ్లీ ఉగ్రమూలాలు

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:31 AM

సైదాబాద్‌లో మళ్లీ ఉగ్రమూలాలు బయటపడ్డాయి. ఒకప్పుడు దేశం లో ఎక్కడ ఉగ్రవాద ఘటన చోటుచేసుకున్నా.. సైదాబాద్‌తో లింకులు ఉంటాయనే అపవాదు ఉండేది. అప్పట్లో గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసుకు కూడా ఇక్కడి ఓ హోటల్‌లో కుట్ర జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

సైదాబాద్‌లో.. మళ్లీ ఉగ్రమూలాలు

  • ఐఎస్‌ ఉగ్రవాది రిజ్వాన్‌ అలీకి ఆశ్రయం

  • శంకేశ్వర్‌బజార్‌లో ఎన్‌ఐఏ సోదాలు

సైదాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సైదాబాద్‌లో మళ్లీ ఉగ్రమూలాలు బయటపడ్డాయి. ఒకప్పుడు దేశం లో ఎక్కడ ఉగ్రవాద ఘటన చోటుచేసుకున్నా.. సైదాబాద్‌తో లింకులు ఉంటాయనే అపవాదు ఉండేది. అప్పట్లో గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసుకు కూడా ఇక్కడి ఓ హోటల్‌లో కుట్ర జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సూరత్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు పేలుళ్లు, పలు కుట్రల విషయంలోనూ ఇక్కడి వారు అరెస్టయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల తర్వాత.. ఆ అపవాదుకు దూరంగా ఉన్న సైదాబాద్‌ పేరు మరోమారు మార్మోగింది.

ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాది రిజ్వాన్‌ అబ్దుల్‌ హజ్‌ అలీ అలియాస్‌ రిజ్వాన్‌(29) సైదాబాద్‌ శంకేశ్వర్‌బజార్‌లోని గ్రీన్‌వ్యూ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు ఆదివారం ఇక్కడ విస్తృతంగా సోదాలు జరిపారు. ఢిల్లీ పోలీసులు గత నెల 8న రిజ్వాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే..! తదుపరి విచారణలో తాను హైదరాబాద్‌లో ఆర్నెల్లు ఆశ్రయం పొం దినట్లు రిజ్వాన్‌ వెల్లడించాడు. దీంతో ఎన్‌ఐఏ అదనపు ఎస్పీ రాజ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం ఆదివారం రిజ్వాన్‌ను వెంటబెట్టుకుని, భారీ బందోబస్తు మధ్య సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ నిర్వహించింది. అతనికి ఆశ్ర యం ఇచ్చిన ఇంటి యజమానిని ఎన్‌ఐఏ ప్రశ్నించిం ది. సుమారు నాలుగు నెలల పాటు రిజ్వాన్‌ అక్కడ మారుపేరుతో తలదాచుకున్నట్లు గుర్తించింది. ఢిల్లీకి చెందిన రిజ్వాన్‌ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత..

2015-16లో ఐఎ్‌సలో చేరాడు. షాహిన్‌బాగ్‌లో నివసిస్తున్న ఝార్ఖండ్‌ వాసి షానవాజ్‌తో 2017లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో యువతను ఆకర్షించి, ఉగ్రవాదం వైపు మళ్లించారు. షానవాజ్‌ మాడ్యుల్‌ గత ఏడాది పుణెలో పట్టుబడగా.. రిజ్వాన్‌ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. ఆ సమయంలోనే హైదరాబాద్‌కు వచ్చి.. మాజీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ సహాయంతో ఆశ్రయం పొందినట్లు తెలిసింది. ఆగస్టు 8న ఢిల్లీ సరిహద్దుల్లో రిజ్వాన్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ.. అతని నుంచి తుపాకి, క్యాడ్రిడ్జ్‌లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. కాగా.. రిజ్వాన్‌ పేరుతో సైదాబాద్‌ ఠాణాలో ఓ చోరీ కేసు ఉంది. ఈ కేసులో దొంగ, ఎన్‌ఐఏ అరెస్టు చేసిన రిజ్వాన్‌ ఒకరేనా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 03:31 AM