Share News

AI Summit: నేరాల భవిష్యవాణి.. ఏఐ చిలక!

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:05 AM

నిత్యం మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు కృత్రిమ మేధ సాయంతో పరిష్కారం చూపుతున్నారు పరిశోధకులు!

AI Summit: నేరాల భవిష్యవాణి..  ఏఐ చిలక!

  • అంధులకు ‘సేవా’ కళ్లజోడు.. కరెంటు ఆదాచేసే ప్లగ్‌

  • రోజువారీ సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం

  • హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఏఐ సదస్సులో

  • సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆవిష్కరణలు

నిత్యం మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు కృత్రిమ మేధ సాయంతో పరిష్కారం చూపుతున్నారు పరిశోధకులు! రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన ఏఐ సదస్సులో అలాంటి పలు ఆవిష్కరణలు.. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకు న్నాయి. అందులో మచ్చుకు కొన్ని..


  • అంధులకు ‘సేవ’ చేసే కళ్ల జోడు

అంధులకు ఎంతగానో ఉపయోగపడే ‘‘సేవా’’ కళ్లజోడును పుర్‌వ్యూఎక్స్‌ సంస్థ రూపొందించింది. ఈ కళ్లజోడు ఏఐ సాయంతో అంధులకు దారిచూపుతుంది. అంతేకాదు.. దారిలో ఉండే అడ్డంకుల గురించి, పరిచయస్తులు ఎవరైనా ఎదురైతే వారి గురించి చెబుతుంది. ఎదురుగా జరుగుతున్న సన్నివేశాన్ని వివరిస్తుంది. కుటుంబ సభ్యులను, కరెన్సీ కాగితాలను గుర్తిస్తుంది. దీని ద్వారా.. వాయిస్‌ కమాండ్‌తో ఫోన్‌ చేయొచ్చు. వార్తలు, సంగీతం వినొచ్చు. ఈ సంస్థ రూపొందించిన బ్లేడ్‌ 2 అనే కళ్లజోడు ద్వారా లైవ్‌ రికార్డింగ్‌లను పంపే అవకాశం ఉంటుంది. విధుల్లో ఉండే పోలీసులు ఈ కళ్లజోడును ధరిస్తే.. వారు చూస్తున్న దృశ్యాలను స్టేషన్‌లో ఉన్న స్ర్కీన్‌పై ఉన్నతాధికారులు చూడవచ్చు.


  • ఖనిజాన్వేషణకు..

భూగర్భంలోని ఖనిజాలను గుర్తించేందుకు జియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఏఐ ఆధారిత సేవలను వినియోగిస్తోంది. జియోలాజికల్‌, జియో కెమికల్‌, జియో ఫిజికల్‌ డేటాను కలిపి విశ్లేషించడం ద్వారా ఏయే ఖనిజాలు ఎక్కడ లభ్యమవుతాయో తెలుసుకునే వీలుంటుంది.


  • నేరాలపై ముందే హెచ్చరిక

ఒక ప్రాంతంలో నమోదైన నేరాలన్నింటినీ విశ్లేషించి.. అక్కడ తరచుగా జరుగుతున్న నేరాలేంటో క్రోడీకరించి, అవీ ఏయే ప్రాంతాల్లో జరుగుతున్నాయో తరచిచూసి.. భవిష్యత్తులో అలాంటి నేరాలు జరిగే ప్రమాదాన్ని ముందే గుర్తించి అప్రమత్తం చేసే యాప్‌ ఒకటి ఉంటే? ఇగ్నీషియా ఏఐ అనే సంస్థ అలాంటి యాప్‌నే అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దుబాయ్‌ పోలీసులు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ యాప్‌ వల్ల అక్కడ చిన్నపాటి నేరాలు 25 శాతం వరకు తగ్గాయని.. తెలంగాణ పోలీస్‌ శాఖ కూడా దీని పనితీరును పరిశీలిస్తోందని వెల్లడించారు.


  • బిజిలీ ఆడిటర్‌

నిత్యం ఇంట్లో వినియోగిస్తున్న ఉపకరణాలు ఎంత కరెంట్‌ వినియోగిస్తున్నాయో గుర్తించడంతోపాటు, కరెంట్‌ ఆదా చేసేందుకు తెలంగాణ స్టార్టప్‌ ‘భారత్‌ స్మార్ట్‌ సర్వీసెస్‌’.. బిజిలీ ఆడిటర్‌, ఏఐ పవర్డ్‌ స్మార్ట్‌ ప్లగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ రూపొందించిన యాప్‌ ద్వారా బిజిలీ ఆడిట్‌ నిర్వహించి ఇంటిలో వినియోగించే విద్యుత్‌ ఉపకరణాలు ఎంత కరెంట్‌ను వినియోగిస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఇక, ఏఐ స్మార్ట్‌ పవర్డ్‌ ప్లగ్‌ ద్వారా కరెంట్‌ బిల్లుతోపాటు కర్బన ఉద్గారాలను కూడా తగ్గించ్చని నిర్వాహకులు తెలిపారు.


  • జాతకం చెప్పే ఏఐ చిలక.. డెస్టినీ!

పుట్టిన తిథి, వారం, నక్షత్రాలను బట్టి జ్యోతిషం చెప్పే యాప్‌ను డెస్టినీ సంస్థ రూపొందించింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, అందులో వివరాలను నమోదు చేస్తే.. మన జీవితంలో జరగబోయే విషయాల గురించి ఒక రోజు ముందు అలర్ట్‌లను అందిస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. దాదాపు 4 కోట్ల మందితో కూడిన డేటాబేస్‌ విశ్లేషించి.. జరగబోయే విషయాలను అంచనా వేసి చెబుతామని, తమ అంచనాలు 80ు దాకా నిజమవుతున్నాయని వారు చెబుతున్నారు.


  • చేతిరాతను డిజిటలైజ్‌ చేసే రినోట్‌ ఏఐ

పుస్తకంలో మనం రాసిన విషయాలను డిజిటలైజ్‌ చేయడంతోపాటు అందులో ఉన్న సమాచారాన్ని అవసరానికి తగిన విధంగా అందించే ఏఐ ఆధారిత యాప్‌ను రినోట్‌ ఏఐ సంస్థ అభివృద్ధి చేసింది. ఏదైనా సమాచారాన్ని నోట్‌ బుక్‌పై రాసి.. దాన్ని రినోట్‌ ఏఐ యాప్‌తో స్కాన్‌ చేస్తే చాలు. ఆ సమాచారాన్ని మనం కోరుకున్న ఫార్మాట్లలో నిల్వ చేస్తుందది.

Updated Date - Sep 06 , 2024 | 04:05 AM