Share News

Akbaruddin Owaisi: గత ప్రభుత్వానిది ‘కచరా’ పాలన

ABN , Publish Date - Dec 21 , 2024 | 03:27 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది ‘కచరా’ పాలన అని.. పదేళ్లపాటు ఎంజాయ్‌ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, ఏడు తరాలకు సరిపడా సంపాదించారని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. ధరణిని ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆయన ఆరోపించారు.

Akbaruddin Owaisi: గత ప్రభుత్వానిది ‘కచరా’ పాలన

  • పదేళ్లలో ఏడు తరాలకు సరిపడా సంపాదించారు

  • ఒక్క కుటుంబం కోసమే ధరణిని తీసుకొచ్చారు

  • అందులో అక్రమాలు ముమ్మాటికీ నిజం: అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది ‘కచరా’ పాలన అని.. పదేళ్లపాటు ఎంజాయ్‌ చేయడంతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేశారని, ఏడు తరాలకు సరిపడా సంపాదించారని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. ధరణిని ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆయన ఆరోపించారు. ధరణిని విఫల ప్రాజెక్టుగా అభివర్ణించారు. భూభారతి బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళన చేశారు. స్పీకర్‌ పోడియం ఎదుట నిలబడి ఫార్ములా ఈ రేసు కేసుపై చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. వారి వైఖరిపై ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్‌.. సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన నిరసన ప్రదర్శన వారి సంస్కృతికి నిదర్శనమన్నారు. నిరసన సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చించివేసిన కాగితాలను చూపిస్తూ ఆపార్టీ సభ్యులకు కేసీఆర్‌ నేర్పిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించారు.


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా, లేక ఒక కుటుంబం కోసం, కుటుంబంలోని ఒక వ్యక్తి కోసం పోరాటం చేస్తున్నారా అని నిలదీశారు. సభ సజావుగా సాగేందుకు.. అవసరమైతే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌ను కోరారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో అక్రమాలు జరిగాయని.. అది ముమ్మాటికీ నిజమని.. ధరణితో కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అక్బరుద్దీన్‌ ఆరోపించారు. దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్‌ భూములు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా భూముల ఆడిటింగ్‌ చేయాలని, మళ్లీ భూముల సర్వే చేపట్టాలని, కొత్త బౌండరీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో భూరికార్డులకు సంబంధించి ఎలాంటి విధానాలున్నాయో అధ్యయనం చేసి.. ఆమేరకు భూభారతి చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని కోరారు.

Updated Date - Dec 21 , 2024 | 03:27 AM