Share News

Family Reunion: మెగా బ్రదర్స్‌ ఇంటికి అల్లు అర్జున్‌

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:05 AM

పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌.. తన మామ, ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు.

Family Reunion: మెగా బ్రదర్స్‌ ఇంటికి అల్లు అర్జున్‌

  • అల్లుడూ ఎలా ఉన్నావ్‌ అని అడిగిన చిరు

  • సతీసమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్‌

  • అనంతరం నాగబాబు నివాసానికి కూడా..

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌.. తన మామ, ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఆదివారం కలిశారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్‌, అర్హతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు. మరో కారులో అల్లు అరవింద్‌ వారిని అనుసరించారు. కాగా, చాలాకాలం తర్వాత తమ ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ను చిరంజీవి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ‘అల్లుడూ ఎలా ఉన్నావ్‌’ అని అడుగుతూ అల్లు అర్జున్‌ను చిరంజీవి ఈ సందర్భంగా ఆలింగనం చే సుకున్నారు. అనంతరం అర్జున్‌ దంపతులు చిరంజీవి పాదాలకు నమస్కరించారు. అనంతరం ఇరు కుటుంబాలు కలిసి భోజనం చేశాయి. కాగా, ఆపత్కాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు చిరంజీవికి అల్లు అర్జున్‌ కృతజ్ఞతలు చెప్పారు. గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా అర్జున్‌కు చిరంజీవి పలు సూచనలు చేశారని సమాచారం. కాగా, అల్లు అర్జున్‌ను జైలు నుంచి విడుదల చేయించేందుకు చిరంజీవి అటు న్యాయపరంగా, ఇటు రాజకీయంగా తన పలుకుబడి వాడారనే ప్రచారం, మెగా కుటుంబానికి అల్లు అర్జున్‌కు దూరం పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, చిరంజీవితో భేటి అనంతరం ఆయన సోదరుడు నాగబాబు నివాసానికి కూడా అల్లు అర్జున్‌ దంపతులు వెళ్లారు.


కేసు విచారణ వల్లే శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నా: అల్లు అర్జున్‌

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను స్వయంగా కలవకపోవడంపై అల్లు అర్జున్‌ స్పందించారు. కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులు చేసిన సూచనల వల్లే శ్రీతేజ్‌ వద్దకు వెళ్లడం లేదని సోషల్‌ మీడియా ద్వారా ఆదివారం ప్రకటించారు. శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. శ్రీతేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి, ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటానని అల్లు అర్జున్‌ వెల్లడించారు.

Updated Date - Dec 16 , 2024 | 05:05 AM