Share News

Allu Arjun: అల్లు అర్జున్‌ బెయిల్‌ రద్దు చేయండి!

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:50 AM

సినీ హీరో అల్లు అర్జున్‌ పెట్టిన ప్రెస్‌మీట్‌ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లుఅర్జున్‌ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్‌ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్‌ బెయిల్‌ రద్దు చేయండి!

  • హైకోర్టులో నేడు పిటిషన్‌ వేయనున్న పోలీసులు

  • కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్‌

  • ఏ పోలీసు అధికారీ తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్‌

  • వ్యాఖ్యలపైనా పూర్తి ఆధారాల సేకరణ

హైదరాబాద్‌, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో అల్లు అర్జున్‌ పెట్టిన ప్రెస్‌మీట్‌ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిలుపై విడుదలైన అల్లుఅర్జున్‌ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్‌ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితంచేసేలా మాట్లాడడంతో ఆయన బెయిలు ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఘటన జరిగాక ఏ పోలీసు అధికారీ తనతో మాట్లాడలేదన్న అర్జున్‌ వ్యాఖ్యలపైనా పూర్తి ఆధారాలను సేకరించారు. అర్జున్‌కు ఊరట లభించేలా వచ్చే నెల21వరకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ..విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న అర్జున్‌ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయనిపుణులు చెబుతున్నారు.


ఈకేసుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ఘాటుగా మాట్లాడిన తర్వాత అల్లుఅర్జున్‌ ఆగమేఘాల మీద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్‌ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు అంటున్నారు. ఈక్రమంలోనే అర్జున్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిలును రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. కాగా, అర్జున్‌ తన న్యాయ బృందానికి చెందిన నిరంజన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి సలహామేరకే మీడియాతో మాట్లాడారని సమాచారం. శనివారం అర్జున్‌ మీడియాతో మాట్లాడినప్పుడు అతని పక్కనే హైకోర్టు న్యాయవాది అశోక్‌రెడ్డి కూర్చున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ మాట్లాడిన దానికి కౌంటర్‌ ఇవ్వాలని అర్జున్‌ పెట్టిన ప్రెస్‌మీట్‌ ఆయనకే తిప్పికొట్టిందని పోలీసులవర్గాల్లో చర్చ జరుగుతోంది.


శ్రీతేజ్‌ కోసం రూ.2 కోట్లతో ట్రస్టు!

సంధ్య థియేటర్‌ ఘటనలో ప్రాణాపాయ స్థితికి చేరి ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్‌ను కోసం అల్లుఅర్జున్‌ ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. అర్జున్‌, సుకుమార్‌, మైత్రి మూవీమేకర్స్‌ కలిసి దాదా పు రూ.2కోట్లను ట్రస్టులో జమచేసి అతని వైద్యం, భవిష్యత్తు కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్టు సమాచారం.

Updated Date - Dec 23 , 2024 | 03:50 AM