Sangareddy: పులివెందుల వైసీపీ నేతల చెరవీడిన తెలంగాణ కార్లు
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:04 AM
గత మూడేళ్లుగా పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న తెలంగాణ వ్యక్తికి చెందిన ఆరు కార్లకు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో మోక్షం లభించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సతీ్‌షకుమార్ హరిహర కార్ రెంటల్ పేరిట సంస్థను నడుపుతున్నాడు.
ఏపీ మంత్రి లోకేష్ చొరవ.. సంగారెడ్డి వాసి సతీ్‌షకు ఊరట
ఇతడి సంస్థ నుంచి లీజుకు తీసుకున్న వికారాబాద్ వాసి
అనంతరం ఎంపీ అవినా్‌షరెడ్డి అనుచరులకు బాడుగకు
సతీ్‌షకు అద్దె చెల్లించని వికారాబాద్ యువకుడు మణిరాజ్
అడిగినందుకు చంపేస్తేమని బెదిరింపులు.. చిత్రహింసలు
ఏపీ ఆదేశాలతో స్వాధీనం చేసుకున్న తెలంగాణ పోలీసులు
సంగారెడ్డి క్రైం, నవంబరు 30: గత మూడేళ్లుగా పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న తెలంగాణ వ్యక్తికి చెందిన ఆరు కార్లకు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో మోక్షం లభించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సతీ్‌షకుమార్ హరిహర కార్ రెంటల్ పేరిట సంస్థను నడుపుతున్నాడు. వికారాబాద్ వాసి మణిరాజ్ 2021 ఏప్రిల్‌లో ఆరు కార్లను అద్దెకు తీసుకున్నాడు. 4 నెలల పాటు డబ్బు చెల్లించలేదు. ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో 2023 జనవరిలో సతీష్ సంగారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మణిరాజ్‌ను ఓ మోసం కేసులో సైబరాబాద్ పరిధి జీడిమెట్ల పోలీసులు నిరుడు జూలై 5న అరెస్ట్ చేశారు. సతీష్ ఫిర్యాదుతో పీటీ వారెంట్‌పై సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాను తీసుకున్న కార్లలో కొన్ని పులివెందుల వైద్య కళాశాలలో లీజుకు నడుస్తున్నాయని, మరికొన్ని వైసీపీ నేతల వద్ద ఉన్నాయని మణిరాజ్ తెలిపాడు. దీంతో సతీష్ వాహనాల గురించి వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వైసీపీ నేతలతో మాట్లాడుదామని వేంపల్లె పోలీసులు తీసుకెళ్లగా కడప ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి అనుచరులు వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శివశంకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భారతి, వైసీపీ నాయకుడు ప్రసాద్‌రెడ్డిలు సతీ్‌షను తీవ్రంగా కొట్టారు. కార్లు అడిగితే చంపుతామని బెదిరించారు.
ఇడుపులపాయలోని గదిలో ఐదు రోజులు బంధించి చిత్రహింసలు పెట్టారు. చంపేందుకు కుట్ర పన్నారు. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఇటీవల సతీష్ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రులు, నేతలను కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. సోషల్ మీడియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లాడు. జనసేన నేతలకు కూడా తెలిపాడు. ఆయన ఆదేశాలతో ఏపీ పోలీసులు.. ఎంపీ అవినా్‌షరెడ్డి అనుచరుల వద్ద ఉన్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి పట్టణ పోలీసులు వాటిని తీసుకువచ్చారు. కార్లను కోర్టులో ప్రవేశపెడతామని సంగారెడ్డి పట్టణ సీఐ ఎస్.రమేష్ శనివారం తెలిపారు. 2021 నుంచి ఎంపీ అవినా్‌షరెడ్డి అనుచరులు తన కార్లను దౌర్జన్యంగా వాడుకున్నారని సతీష్ చెప్పాడు. వేంపల్లె పోలీసులు గతంలో వైసీపీ నేతలకే మద్దతు పలినట్టు ఆరోపించాడు. కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి వైసీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరాడు.