Share News

Hyderabad: మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని, మేనేజర్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Oct 21 , 2024 | 04:36 AM

మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహించిన సికింద్రాబాద్‌ మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని రషీద్‌, మేనేజర్‌ రహమాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని, మేనేజర్‌ అరెస్ట్‌

  • పరారీలో వ్యక్తిత్వ వికాస శిక్షకుడు మునావర్‌

  • లాఠీచార్జీలో గాయపడిన వారికి ఎంపీ ఈటల పరామర్శ

  • భక్తులు సంయమనం పాటించాలని వినతి

  • ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ భద్రత

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహించిన సికింద్రాబాద్‌ మెట్రో పొలిస్‌ హోటల్‌ యజమాని రషీద్‌, మేనేజర్‌ రహమాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రషీద్‌ను ముంబైలో అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిత్వ వికాస శిక్షకుడు మునావర్‌ కోసం గాలిస్తున్నారు. మెట్రో పొలిస్‌ హోటల్‌లో వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం వచ్చిన యువకుడు కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీంతో హోటల్‌ నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు హోటల్‌ను సీజ్‌ చేశారు.


ప్రాధమికంగా లభ్యమైన ఆధారాల మేరకు మెట్రో పొలిస్‌ హోటల్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలకు వేదికగా మారిందని, ఈ కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కూడా లేదని పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసానికి నిరసనగా చేపట్టిన ర్యాలీలో పోలీసులపై దాడి ఘటనకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4, గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. దాడులకు పాల్పడిన నిందితులను గుర్తించడానికి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్‌లు ఏర్పాటు చేసి స్థానికులను మాత్రమే అనుమతించారు. ఇతరులను అటు వైపు రాకుండా కట్టడి చేశారు. మీడియాను కూడా అనుమతించలేదు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాలను మూసి వేయించారు.


  • కార్యకర్తలకు ఈటల, బండి పరామర్శ

సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ ఆలయం వద్ద జరిగిన లాఠీ చార్జీలో గాయపడిన బీజేపీ కార్యకర్తలు సాయికుమార్‌గౌడ్‌, వెంకటే్‌షలను కేంద్రహోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజెందర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రెండు నెలలుగా వరుసగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అడ్డాగా ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ నుంచి వందల సంఖ్యలో ట్రైనింగ్‌ పేరిట ఉన్మాదాన్ని పెంచుతున్నారని అన్నారు. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోంమంత్రికి, రాష్ట్ర డీజీపీకి లేఖ రాసినట్లు ఈటల వెల్లడించారు. భక్తులు ఆగ్రహావేశాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని కోరారు.

Updated Date - Oct 21 , 2024 | 04:36 AM