Telugu University: పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు సరికాదు
ABN , Publish Date - Aug 06 , 2024 | 03:44 AM
తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతమున్న పొట్టి శ్రీరాములు పేరును మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు అర్ధరహితమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేర్కొంది.
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ
ఖైరతాబాద్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రస్తుతమున్న పొట్టి శ్రీరాములు పేరును మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు అర్ధరహితమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పేర్కొంది. ఈ విషయమై తెలుగువారందరూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపింది. తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు మార్చాలని వచ్చిన ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసిన విషయమై ఆర్యవైశ్య మహాసభ నేతలు స్పందించారు.
సోమవారం చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో సభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, కార్యదర్శి రేణుకుంట్ల గణేష్ గుప్త, కోశాధికారి కొండ్లె మల్లిఖార్జున్‌లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ పొట్టి శ్రీరాములు ఆరాధ్యుడేనని, ఆయనను ఒక ప్రాంతానికి చెందిన వారిగా చూడడం సరికాదని వారు అన్నారు. పేరు మార్పిడి విషయం తెలిసినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయమై ఉపముఖ్యమంత్రి భట్టికి వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు.