AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్.. హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు తర్వాత చర్యలు
ABN , Publish Date - Dec 19 , 2024 | 07:25 AM
చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) హెచ్చరించారు.
- అక్రమ నిర్మాణాల కూల్చివేతకు 2024 జూలై కటాఫ్
- ఆ తర్వాత చేపట్టిన నిర్మాణాలేవైనా అక్రమమైతే కూల్చివేతే
- నివాసేతర నిర్మాణాలు ఎప్పటివైనా తొలగిస్తాం
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ: చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) హెచ్చరించారు. హైడ్రా పోలీస్‌స్టేషన్(Hydra Police Station) ఏర్పాటు అనంతరం ఈ దిశగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హైడ్రా చర్యలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. సంస్థ విధివిధానాలు, పరిధిని వివరిస్తూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తప్పు చేసి ఉల్టా బెదిరింపు..
2024 జూలైలో హైడ్రా ఏర్పాటైందని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దానినే కటాఫ్ తేదీగా పెట్టుకున్నామని తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అంటే జూలైకి మునుపు... చెరువుల ఎఫ్‌టీఎల్, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అనుమతులతో నిర్మించి, ప్రజలు నివాసముంటున్న నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. భవన నిర్మాణం ఎప్పుడు జరిగిందనేది గూగుల్ ఎర్త్, క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా గుర్తిస్తామని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించిన వ్యాపార, వాణిజ్య వినియోగ భవనాలకు ఈ కటాఫ్ తేదీ వర్తించదన్నారు. గతంలో అనుమతులిచ్చి.. అనంతరం పర్మిషన్ రద్దు చేసిన పక్షంలో ఆ నిర్మాణాలు నివాసాలైనా.. వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు.
హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రజలకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంశాలపై కొంత అవగాహన వచ్చిన నేపథ్యంలో జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని వివరించారు. అనుమతి ఉన్నా, లేకున్నా.. చెరువుల ఎఫ్‌టీఎల్‌లో భవనాలు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌లో ఉన్న నివాసేతర నిర్మాణాలు(ఎన్- కన్వెన్షన్ వంటివి) ఎప్పుడు నిర్మించినా చర్యలుంటాయని రంగనాథ్ వివరించారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఆ సంస్థలపై ఫిర్యాదు
నార్సింగ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో మూసీని ఆక్రమిస్తోన్న రాజ్‌పుష్ప, ఆదిత్య బిల్డర్స్ తదితర సంస్థలపై స్థానిక పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేశామని హైడ్రా కమిషనర్‌రంగనాథ్ తెలిపారు. మూసీలో పోసిన మట్టిని, ఇప్పటికే కట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆయా సంస్థలను ఆదేశించామని చెప్పారు. మూసీలో అక్రమంగా జరుగుతున్న మట్టి డంపింగ్‌ను అడ్డుకునేందుకు హైడ్రా బృందాలు రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్నాయని చెప్పారు. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత చెరువుల ఎఫ్‌టీఎల్, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా తప్పుడు సమాచారంతో అనుమతులు తెచ్చుకున్నట్టు తేలితే.. ఆయా అనుమతులు రద్దుకు సంబంధిత శాఖలకు సిఫారసు చేస్తామన్నారు. ఆక్రమణలపై ప్రజల నుంచి వచ్చిన 5 వేల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాయని చెప్పారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
శివారుల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు
జీహెచ్‌ఎంసీ అవతల 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత అధికారాన్ని ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలు, అక్రమ కట్టడాలపై దృష్టి సారించామని చెప్పారు. ఆయా నిర్మాణాల నియంత్రణకు చర్యలు తీసుకోని స్థానిక సంస్థల అధికారులపై చర్యలు తప్పవన్నారు. అక్రమ నిర్మాణమైనా.. ప్రజలు నివాసముండని వాటిపైనే చర్యలుంటాయని అన్నారు. వ్యక్తిగత ప్లాట్లలో(స్థలాల్లో)ని అక్రమ నిర్మాణాలనూ హైడ్రా కూల్చివేస్తుందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ(GHMC) పరిధిలోని అక్రమ నిర్మాణాలపై పట్టణ ప్రణాళికా విభాగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఐదు నెలల్లో హైడ్రా చేపట్టిన చర్యలతో సుమారు 200 ఎకరాల చెరువు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. 12 చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News