Share News

Bandi Sanjay: రాష్ట్రంలో త్వరలో ప్రజా తిరుగుబాటు ’

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:42 AM

తెలంగాణలో త్వరలో ప్రజా తిరుగుబాటు రానున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో శనివారం మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay: రాష్ట్రంలో త్వరలో ప్రజా తిరుగుబాటు ’

  • కాంగ్రెస్‌ సర్కార్‌పై బీజేపీ యుద్ధం.. ఇక ఇండియా కూటమి ముక్కలే

  • బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌/సిరిసిల్ల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణలో త్వరలో ప్రజా తిరుగుబాటు రానున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయ ఆవరణలో శనివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతున్నదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసిందన్నారు. కాంగ్రెస్‌ కూటమి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. భవిష్యత్తులో ఆ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ ఆ పార్టీలో లుకలుకలు మొదలు కాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూల్చుకుంటారన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


రాష్ట్రంలో చేపడుతున్న కులగణన పెద్ద బోగస్‌ అన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును ఇప్పటికైనా బయట పెట్టాలన్నారు. ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. బీఆర్‌ఎస్‌ దారిలోనే ప్రస్తుతకాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా నడుస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రూ.23 కోట్ల కేంద్రం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో నిధులు ఇచ్చిందన్నారు. నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని తమవిగా ప్రచారం చేసుకుందని, రాజకీయ వైషమ్యాలతో కుట్రలు చేసిందని విమర్శించారు. అంతకుముందు గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో పురాతన దేవాలయంలో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 04:42 AM