Bandi Sanjay: జన్వాడ అక్రమ నిర్మాణాలపై .. సీఎం ఎందుకు స్పందించడం లేదు
ABN , Publish Date - Aug 30 , 2024 | 03:51 AM
జన్వాడ అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
చెరువులో కట్టిన ఒవైసీ కాలేజీలపై చర్యలేవి..?
వేరే విద్యా సంస్థలకు నోటీసులిస్తారా: సంజయ్
రంగనాథ్ ఖద్దరు బట్టలు వేసుకోవాలి: ఏలేటి
సిరిసిల్ల రూరల్/హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జన్వాడ అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఆ కబ్జాలపై పోరాటం చేసి జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. సిరిసిల్లలో గురువారం సంజయ్ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఒక్క ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసి గొప్ప అనిపించుకోవద్దని అన్నారు.
హైదరాబాద్‌లోని సల్కం చెరువులో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కళాశాల భవనాలను నిర్మించారని.. వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు ఉన్నందున గడువు ఇస్తామని చెప్పిన హైడ్రా అధికారులు.. ఇతర విద్యాసంస్థల భవనాలను కూల్చివేసేందుకు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ భవనంపై చేయి వేస్తే ప్రభుత్వం సంగతి చూస్తానని ఒవైసీ బెదిరిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను ప్రజలు మర్చిపోయేందుకు ప్రభుత్వం హైడ్రాను తెరమీదికి తీసుకొచ్చిందని సంజయ్ అన్నారు.
కాగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనను విమర్శించాలనుకుంటే ఖాకీ డ్రెస్సు బదులు ఖద్దరు బట్టలు వేసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రంగనాథ్ వ్యవహారం పని తక్కువ.. పబ్లిసిటీ ఎక్కువ అన్న చందంగా ఉందని విమర్శించారు. ‘‘ఐపీఎస్ అధికారులు వృత్తిలో భాగంగా అవసరమైతేనే మీడియాతో మాట్లాడాలి. కానీ రంగనాథ్ తన ఇమేజ్ ప్రమోషన్ కోసం అదే పనిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూల్లో నన్ను ఉద్దేశించి మాట్లాడటం సరికాదు.
నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇస్తా. పాతబస్తీలోని చెరువులను పునరుద్ధరించిన తర్వాతే హైదరాబాద్‌లోని మిగతా చెరువుల ఆక్రమణలు తొలగించాలి. సల్కం చెరువులోని ఒవైసీ భవనాల్లో విద్యా సంస్థలున్నాయని, విద్యా సంవత్సరం పూర్తయ్యాక వాటిని కూల్చేస్తామంటున్నారు. ఇదే సూత్రం ఇతర విద్యాసంస్థలకు ఎందుకు వర్తించదు..? అంటే హైడ్రా హిందువులపై ప్రయోగించడానికేనా..? అక్బరుద్దీన్ డీఫ్యాక్టో డిప్యూటీ సీఎంలా వ్యవహరిస్తున్నారు. అందుకే హైడ్రా ఆయన విద్యాసంస్థల జోలికెళ్లడం లేదు’’ అని మహేశ్వర్‌రెడ్డి అన్నారు.