Bandi Sanjay: అవినీతి, ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?
ABN , Publish Date - May 08 , 2024 | 05:20 AM
అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చింది: సంజయ్
భగత్‌నగర్, మే 7: అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కరీంనగర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తనపై కాంగ్రెస్ నాయకులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని బండి అన్నారు. తన ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణ కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మీ ఆస్తి, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.
విచారణ కోసం తాను సీబీఐకి లేఖ రాసేందుకు సిద్ధమని, పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టు అని ఆయన్ను, ఆయన కుటుంబాన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు సీబీఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చి తాను సుద్దపూసనని, మోదీ అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు.
అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రె్‌సకు ఎక్స్‌పైరీ డేట్ వచ్చిందన్నారు. జాతీయ కాంగ్రెస్ కాస్తా రెండు రాష్ట్రాలకే పరిమితమైందన్నారు. వేములవాడకు రానున్న మోదీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 8 గంటలకు వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకుని దర్శించుకుంటారన్నారు. వేములవాడ బాలానగర్ కోర్టు వద్ద మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.