Share News

Bandi Sanjay: ది సబర్మతీ రిపోర్ట్‌ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలి

ABN , Publish Date - Nov 23 , 2024 | 04:19 AM

‘ది సబర్మతీ రిపోర్ట్‌’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు. ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్‌లో ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చారని తెలిపారు.

Bandi Sanjay: ది సబర్మతీ రిపోర్ట్‌ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలి

  • కాంగ్రెస్‌ కుట్రలను బయటపెట్టిన చిత్రం ఇది: సంజయ్‌

హైదరాబాద్‌/పంజాగుట్ట/జహీరాబాద్‌/ న్యూఢిల్లీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు. ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్‌లో ట్యాక్స్‌ మినహాయింపు ఇచ్చారని తెలిపారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌లో ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ సినిమాను సంజయ్‌ వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘గోద్రా ఘటనలో కాంగ్రెస్‌ ఒక వర్గానికి మద్దతిచ్చింది. అయోధ్య నుండి వచ్చిన కరసేవకులను హతమార్చడం ద్వారా ఈ దేశంలో మత విద్వేషాలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొదాలని కాంగ్రెస్‌ చేసిన కుట్రను ఈ సినిమా ద్వారా బహిర్గతం చేశారు. కరసేవకుల హత్యకు చేసిన కుట్రనే గోద్రా ఘటన అని చెప్పినా.. కాంగ్రెస్‌ పార్టీ, ఒక సెక్షన్‌ మీడియా కావాలని ప్రజల దృష్టి మళ్లించింది. ఈ సినిమాతో వాస్తవాలు బయటకు వచ్చాయి’’ అని సంజయ్‌ పేర్కొన్నారు.


  • రేవంత్‌, అదానీ ఒప్పందాల సంగతేంటి..?: రఘునందన్‌ రావు

అమెరికాలో అదానీ కుంభకోణం వ్యవహారంలో జరిగిన నేరారోపణలో బీజేపీ కడిగిన ముత్యంలా బయట పడుతుందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఆరోపణల్లో ఇరుక్కున్న ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాహుల్‌ గాంధీ చెప్పాలని సవాల్‌ విసిరారు. కుంభకోణంలో ప్రధాని మోదీకి సంబంధం లేదని, రాహుల్‌ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌, అదానీ చేసుకున్న ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు.

  • రాష్ట్రపతికి పుస్తకం అందజేసిన విద్యాసాగర్‌రావు

‘తెలంగాణ ప్రాంత గిరిజనుల సమస్యలు-చట్టపరమైన పరిష్కారం’పై తాను రచించిన పుస్తకాన్ని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో రాష్ట్రపతిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Nov 23 , 2024 | 04:19 AM