Bandi Sanjay: అన్నంలో రాళ్లొస్తుంటే ఏం చేస్తున్నారు?
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:38 AM
‘అన్నంలో ప్రతి రోజూ రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు బాధపడుతున్నారు. మన పిల్లలకు రాళ్లు వస్తే తినిపిస్తామా? ఎందుకు చర్యలు తీసుకోవడం లేద’ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏకలవ్య పాఠశాలల అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
సిరిసిల్ల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘అన్నంలో ప్రతి రోజూ రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు బాధపడుతున్నారు. మన పిల్లలకు రాళ్లు వస్తే తినిపిస్తామా? ఎందుకు చర్యలు తీసుకోవడం లేద’ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకుల పాఠశాలలను సందర్శించారు. మరిమడ్ల పాఠశాలలో ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. రూ.16 లక్షలతో టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొక్కలు నాటారు. ఆయా పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు.
ఆటలు ఆడించడం లేదని, టాయిలెట్లలో నల్లాల నుంచి నీళ్లు రావడం లేదని వారు తెలిపారు. తొలిసారి కాబట్టి వదిలేస్తున్నానని, ఇకపై ఇలా జరిగితే సహించేది లేదని అధికారులను సంజయ్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, సమస్యలుంటే చర్యలు తప్పవన్నారు. ఏం కావాలనుకుంటున్నారని విద్యార్థులను సంజయ్ అడగ్గా.. పలువురు కలెక్టర్, పోలీస్, డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుతామని, ఆర్మీలో చేరతామని చెప్పారు. ఒక విద్యార్థి మాత్రం తహసీల్దార్ కావాలని అనుకుంటున్నానని చెప్పగా.. ఎందుకని సంజయ్ అడిగారు. తమ ఊళ్లో భూములను దోచుకుంటున్నారని, తహసీల్దార్ అయితే వాటిని కాపాడవచ్చని ఆ విద్యార్థి చెప్పాడు.
రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తే ఎవరూ ఆసక్తి చూపకపోవడం విశేషం. ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించిన సందర్భంగా సంజయ్ కింద కూర్చుని.. విద్యార్థినులు పాడిన పాటలు విన్నారు. సంజయ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. డబ్బుకు వెనుకాడకుండా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని, ఒక్కో విద్యార్థికి సగటున రూ.లక్షా 9 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 1,26,626 మంది విద్యార్థులు ఏకలవ్య పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలల్లో 8,309 మంది చదువుతున్నారని తెలిపారు.