Banjara Hills : బాత్రూమ్లో శవాలై కనిపించారు...
ABN , Publish Date - Jul 22 , 2024 | 03:58 AM
ఏం జరిగిందో ఏమో.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు తమ ఇంటి బాత్రూమ్లోనే శవాలై కనిపించారు. సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది.
హైదరాబాద్‌లో ఓ కుటుంబం అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఏం జరిగిందో ఏమో.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు తమ ఇంటి బాత్రూమ్లోనే శవాలై కనిపించారు. సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఆర్.వెంకటేష్ (59), తన భార్య మాధవి(52), కుమారుడు హరికృష్ణ(25)తో కలిసి కొన్నేళ్లుగా హైదరాబాద్, సనత్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు.
వెంకటేష్ సైనోడ్ అనే సంస్థలో బిజినెస్ యూనిట్ హెడ్‌గా పని చేస్తుంటారు. అయితే, వారి ఇంటి పనులు చేసే వరలక్ష్మి ఎప్పట్లాగే ఆదివారం ఉద యం కూడా రాగా ప్లాట్ తలుపు తీసి ఉండగా ఇంట్లో ఎవరూ కనిపించలేదు. వెంకటేష్, కుటుంబసభ్యులు గదిలో ఉన్నారని భావించిన వరలక్ష్మి వంట గదిలోకి వెళ్లి పని చేసే వెళ్లిపోయింది. మళ్లీ సాయంత్రం రాగా ఎవరూ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికి వెళ్లిపోయింది.
కాసేపటి తర్వాత అపార్ట్మెంట్ వాచ్మెన్, మరికొందరితో కలిసి వచ్చిన వరలక్ష్మి... బాత్రూమ్ తలుపు బలవంతంగా తెరిచి చూడగా వెంకటేష్, మాధవి, హరికృష్ణ విగతజీవులుగా పడి ఉన్నారు. హరికృష్ణ శరీరంపై దుస్తులు లేవు. పోలీసుల ఆధారాలు సేకరించారు. కాగా, హరికృష్ణ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులే అతనికి స్నానం చేయిస్తుంటారని తెలిసింది. హరికృష్ణకు స్నానం చేయించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మరణించి ఉంటారని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.