Share News

Bank Embezzlement: 50లక్షలు కాజేసి.. 22 ఏళ్లుగా తప్పించుకొని..

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:47 AM

పనిచేస్తున్న బ్యాంకుకే రూ.50 లక్షల మేర టోపీ పెట్టాడా ఉద్యోగి. ఇది జరిగి ఏకంగా 22 ఏళ్లయింది. సీబీఐ నుంచి తప్పించుకొనేందుకు ఎప్పటికప్పుడు వేషం మార్చేయడం..

Bank Embezzlement: 50లక్షలు కాజేసి.. 22 ఏళ్లుగా తప్పించుకొని..

  • పనిచేస్తున్న బ్యాంకుకే టోపీ పెట్టిన కంప్యూటర్‌ ఆపరేటర్‌.. వేషం, పేర్లు, ఊర్లు మారుస్తూ పోలీసులకు బురిడీ

  • చివరికి స్వామీజీ అవతారం..

  • రూ.7లక్షలతో శ్రీలంక పరారీకి ప్లాన్‌.. తమిళనాడులో అరెస్టు

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పనిచేస్తున్న బ్యాంకుకే రూ.50 లక్షల మేర టోపీ పెట్టాడా ఉద్యోగి. ఇది జరిగి ఏకంగా 22 ఏళ్లయింది. సీబీఐ నుంచి తప్పించుకొనేందుకు ఎప్పటికప్పుడు వేషం మార్చేయడం.. ఉన్న ఊరు నుంచి మరో ఊరు.. వెళుతూ చివరికి ఓ స్వామీజీ అవతారమెత్తి.. ఓ ఆశ్రమం తెరిచి.. భక్తుల నుంచి దండిగానే దోచుకున్నాడు. ఆ రూ.7 లక్షల డబ్బుతో సముద్రమార్గం మీదుగా శ్రీలంకకు ఉడాయించే ప్రణాళికలో ఉండగా సీబీఐ అధికారులకు దొరికిపోయాడు!: 2002లో నేరం చేస్తే.. ఇప్పటికి దొరికిన ఆ నిందితుడి పేరు వి. చలపతిరావు. హైదరాబాద్‌లోని చందులాల్‌ బరాదరి ఎస్బీఐ బ్రాంచ్‌లో చలపతి రావు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు.


2002లో నకిలీ పత్రాలు సృష్టించి పనిచేస్తున్న బ్యాంకులో రూ. 50 లక్షలు కాజేశాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు అదే ఏడాది మే 1న కేసు నమోదు చేశారు. రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. తర్వాత తన భర్త కనిపించకుండా పోయి ఏడేళ్లయిందని, ఫలితంగా చనిపోయినట్లు ప్రకటించాలని కోరుతూ నిందితుడి భార్య సివిల్‌ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కోర్టు ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు ముమ్మరం కావడంతో హైదరాబాద్‌ నుంచి పరారైన చలపతి ఆ తర్వాత పేర్లు, చిరునామాలు, ఆధార్‌ కార్డులు మారుస్తూ తిరిగాడు. 2007లో వినీత్‌ కుమార్‌గా పేరు మార్చుకుని తమిళనాడు సేలంలో మరో వివాహం చేసుకున్నాడు.


అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ సిద్ధం కాగా అక్కడి నుంచి పరారయ్యాడు. భోపాల్‌ చేరుకుని లోన్‌ రికవరీ ఏజెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌ మకాం మార్చాడు. తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని వెరుల్‌ గ్రామంలో ఉన్న ఆశ్రమంలో స్వామి విధిత్మానంద తీర్ధ్ఠగా అవతారమెత్తాడు. ఆ ఆశ్రమం నుంచి వెళ్లే సమయంలో శిష్యురాలిని వెంటబెట్టుకుని వెళ్లాడు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు వెళ్లి 2024 జూలై 8వ తేదీ వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత తమిళనాడు తిరుసల్వేలోని నర్సింగునుల్ల గ్రామం చేరుకున్నాడు. శ్రీలంక వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా సమాచారంతో సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - Aug 06 , 2024 | 04:47 AM