Bhadrachalam: భద్రాచలంలో గోదావరి వరదకు అడ్డుకట్ట.. కొనసాగుతున్న మిగులు కరకట్ట నిర్మాణ పనులు
ABN , Publish Date - Apr 12 , 2024 | 10:17 AM
గోదావరి వరదలతో భద్రాద్రివాసులకు ముంపు బెడద లేకుండా ఇకపై కరకట్ట పూర్తిస్థాయి రక్షణ గోడగా నిలవనుంది. భద్రాచలం(Bhadrachalam) సుభాష్ నగర్ కాలనీ వద్ద నుంచి చేపట్టాల్సిన మిగులు కరకట్ట నిర్మాణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించింది.
- జూన్ నాటికి పూర్తి చేసేలా అధికారుల కసరత్తు
- ఇప్పటికే రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు మంజూరు
భద్రాచలం: గోదావరి వరదలతో భద్రాద్రివాసులకు ముంపు బెడద లేకుండా ఇకపై కరకట్ట పూర్తిస్థాయి రక్షణ గోడగా నిలవనుంది. భద్రాచలం(Bhadrachalam) సుభాష్ నగర్ కాలనీ వద్ద నుంచి చేపట్టాల్సిన మిగులు కరకట్ట నిర్మాణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించింది. 700 మీటర్ల నిడివి పనులను రూ.38 కోట్ల అంచనా విలువతో చేపట్టారు. వీటిని జూన్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యమని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ పనులపై గత దశాబ్ద కాలంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న విమర్శలు ఉన్నాయి. 2022 జూలై 16న గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో పట్టణంలోని శివారు కాలనీలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు ముంపు నుంచి రక్షణ కల్పించేందుకు కరకట్ట మిగులు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పనులకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు శంకుస్థాపన జరిగింది. అయితే తొలి నుంచి భద్రాద్రివాసులకు ముంపు నుంచి రక్షణ కల్పిస్తామని మంత్రి తుమ్మల భరోసా ఇవ్వడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పనులు ప్రారంభమయ్యాయి.
ఆ కరకట్టే శ్రీరామరక్షగా నిలిచింది
భద్రాచలం వద్ద కరకట్టతో 2022 జూలైలో పట్టణానికి వరద గండం తప్పింది. 1986లో వచ్చిన గోదావరి వరదలను చూసి అప్పటి సీఎం ఎన్టీఆర్ చలించిపోయారు. అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల సూచన మేరకు కరకట్ట నిర్మాణానికి ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. కొంతవరకు కరకట్ట నిర్మించారు. ఆ తరువాత పనులు నిలిచిపోగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ.53 కోట్లు మంజూరు చేసి, యటపాక నుంచి సుభాష్ నగర్ వరకు పది కిలోమీటర్లకు పైగా కరకట్ట నిర్మించా రు. దీంతో భద్రాచలం పట్టణంతో పాటు శివారున ఉన్న రాజుపేట, మేడువాయి తదితర గ్రామాలకు వరద ముంపు తప్పింది. అయితే 2022 జూలై 16న భద్రాచలం వద్ద గోదావరి 71.3 అడుగుల నీటిమట్టంతో ప్రవహించడంతో అపార నష్టం సంభవించింది. సుభా్‌షనగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ, కూనవరం రోడ్డు, సీఆర్‌పీఎఫ్ క్యాంపు కార్యాలయాలు పూర్తిగా నీట మునిగాయి. ఇదంతా కరకట్ట లేని ప్రాంతం నుంచి వచ్చిన వరద వల్లే జరిగింది. భద్రాద్రికి భవిష్యత్తులో వచ్చే వరదలతో ముంపు లేకుండా శాశ్వత రక్షణ కావాలంటే పూర్తిస్థాయి కరకట్ట నిర్మాణంతోనే సాధ్యమని స్థానికులు పేర్కొంటున్నారు. కరకట్ట స్లూయి్‌సల నుంచి లీకులు లేకుం డా చర్యలు చేపట్టి, గోదావరి స్నాన ఘట్టాలు, విస్తా కాంప్లెక్సు పరిసరాల్లో ఉన్న కరకట్ట అంతర్భాగం పటిష్ఠం చేసి, 15 అడుగులకు ఎత్తు పెంచాలని కోరుతున్నారు.
రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు
భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు గోదావరి వరద ముంపు నుంచి శాశ్వత రక్షణ కల్పించేందుకు ఇప్పటికే రూ.500 కోట్లను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మించి ముంపు కష్టాలను తీర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మార్చి 11న భద్రాచలంలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ తెలిపారు.
ఇదికూడా చదవండి: వన్యప్రాణులకు నీటి సమస్య లేకుండా చర్యలు