Bhatti Vikramarka: పార్టీ కోసం కష్టపడిన వారికి త్వరలోనే పదవులు..
ABN , Publish Date - Jun 20 , 2024 | 04:21 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడిన నాయకుల సమగ్ర సమాచారం అధిష్ఠానం వద్ద ఉందని, వారికి త్వరలోనే పదవుల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
విద్యుత్తు కొనుగోళ్లపై విచారణ చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలకు ఆందోళన ఎందుకు?
మేడిగడ్డలో ఇసుక తొలగిస్తేనే మరమ్మతులు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడిన నాయకుల సమగ్ర సమాచారం అధిష్ఠానం వద్ద ఉందని, వారికి త్వరలోనే పదవుల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యుత్తు కొనుగోళ్ల అంశంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రకటించినప్పుడు.. దీనిపై న్యాయ విచారణ జరగాలంటూ మాజీ విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో పదేపదే కోరారన్నారు. ఆ నేపథ్యంలోనే విద్యుత్తు కొనుగోళ్లపైన విచారణ జరుగుతుంటే బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. అంతా తానై కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కడితే.. అది కూలిపోయిందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బరాజ్‌లో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
తమ ప్రభుత్వమూ అప్పులు చేస్తుందని, ఆ అప్పులతో సంపదను సృష్టించి సంక్షేమ పథకాల రూపంలో ఆ సంపదను ప్రజలకు పంచుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాతనే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులకనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు. రైతు రుణమాఫీ అంశానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఎవరికెలాంటి అనుమానాలు అవసరంలేదన్నారు. రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల మేరకు వడ్డీలేని రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆయన చూపిన మార్గాన్ని టీపీసీసీ నుంచి గ్రామస్థాయి కార్యకర్తవరకు ముందుకు తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామంటూ రాహుల్ ప్రకటించారని, అధికారంలోకి రాగానే ఆ దిశగా కార్యాచరణ చేపట్టామని చెప్పారు.