Bhatti Vikramarka: జల విద్యుత్ కేంద్రాలకు మరమ్మతులు ఏవి?
ABN , Publish Date - Aug 11 , 2024 | 02:56 AM
‘రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాలున్న ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చే యలేకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పాడైన యూనిట్లకు సకాలంలో మరమ్మతు చేయకపోవడంవల్లే భారీగా నష్టం జరిగింది.
వరద వస్తున్నా పూర్తి ఉత్పత్తి లేదు
అధికారుల నిర్లక్ష్యంతో భారీగా నష్టం
నిర్లక్ష్యంగా ఉన్నవారిని కొనసాగించాల్సిన అవసరం లేదు: భట్టి
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో జల విద్యుత్ కేంద్రాలున్న ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నా పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చే యలేకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. పాడైన యూనిట్లకు సకాలంలో మరమ్మతు చేయకపోవడంవల్లే భారీగా నష్టం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిని కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జలవిద్యుత్ కేంద్రాల్లో సత్వరం మరమ్మతులు నిర్వహించి వాటి ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్లుగా పునరుద్ధరించాలని ఆదేశించారు.
శనివారం ఆయన ప్రజాభవన్‌లో జెన్‌కో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జలాశయాల వద్ద 2,441.8 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలుండగా... వాటిలో 300.8 మెగావాట్ల కేంద్రాలు పాడైపోవడం పట్ల భట్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల తదితర జలవిద్యుత్ కేంద్రాలకు మరమ్మతుల విషయంలో గతంలో సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో వరదలు వస్తున్నా పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసుకోలేకపోతున్నామంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తే సహించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. అలాగే జల విద్యుత్ కేంద్రాల పనితీరు, ఉత్పాదకతపై వారానికోసారి తనకు నివేదికలు ఇవ్వాలని, విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు వస్తే తక్షణమే ఇంధన శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆదేశించారు. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే చీఫ్ ఇంజనీర్ల నుంచి రాతపూర్వకంగా సంజాయిషీ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 17 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.