Share News

Bhatti Vikramarka: మీలాగా ఇళ్లల్లో పడుకోలేదు.. ప్రతి రోజూ ప్రజల్లో ఉంటున్నాం

ABN , Publish Date - Sep 01 , 2024 | 03:36 AM

‘‘మాది ఫ్యూడల్‌ గవర్నమెంట్‌ కాదు.. పీపుల్స్‌ గవర్నమెంట్‌.. మీలాగా ఇళ్లల్లో పడుకోవడం లేదు.. ప్రతీరోజు ప్రజల్లోనే ఉంటున్నాం.. నువ్వు, నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని దోచుకుని విదేశాల్లో దాచుకున్నారు.

Bhatti Vikramarka: మీలాగా ఇళ్లల్లో పడుకోలేదు.. ప్రతి రోజూ ప్రజల్లో ఉంటున్నాం

  • కేసీఆర్‌.. ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు: భట్టి

పెద్దపల్లి/గోదావరిఖని, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ‘‘మాది ఫ్యూడల్‌ గవర్నమెంట్‌ కాదు.. పీపుల్స్‌ గవర్నమెంట్‌.. మీలాగా ఇళ్లల్లో పడుకోవడం లేదు.. ప్రతీరోజు ప్రజల్లోనే ఉంటున్నాం.. నువ్వు, నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని దోచుకుని విదేశాల్లో దాచుకున్నారు. ఏం చేశావని, ఏం ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తావ్‌ కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ఉద్యోగాలు ఇస్తుందని.. సంక్షేమ పథకాలు చేపడుతుందని వద్దు అని చెప్పడానికా.. లక్ష వరకు రుణ మాఫీ చేయలేదని, డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్లు, మూడు ఎకరాల భూమి, ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తావా?’’


అంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి పెద్దపల్లి జిల్లా రామగుండం, గోదావరిఖనిలలో ఆయన పర్యటించారు. గోదా వరిఖనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభిచారు. అనంతరం అక్కడ జరిగిన సభలో భట్టివిక్రమార్క ప్రసంగించారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, విద్యుత్‌ అమ్మగా వచ్చిన సంపదను ప్రజలకు పంచి పెడతామని చెప్పారు.


రామగుండంలో 800 మెగవాట్ల విద్యుత్‌ ప్లాంటు నిర్మాణం కోసం విధాన పరమైన నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే 18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. ప్రజల్లోకి వస్తానని చెబుతున్న కేసీఆర్‌ ఏం చేశారని చెప్పడానికి వస్తారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో విదేశాలకు వెళ్లి పెట్టుబడి తీసుకురాని కేసీఆర్‌, ఆయన కుమారుడు సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకున్నారని ఆరోపించారు.

Updated Date - Sep 01 , 2024 | 03:36 AM