Bhatti vikramarka: హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం..
ABN , Publish Date - May 20 , 2024 | 03:32 AM
పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య పారిశ్రామిక క్లస్టర్లు
‘గ్రీన్ ప్రాపర్టీ షో’లో భట్టివిక్రమార్క
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని కాపాడేలా భవన నిర్మాణాలు చేపట్టి తెలంగాణలో జీవన విధానం మార్చాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్ ఆదా చేసే హరిత నిర్మాణాలకు సర్కారు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. సగటు మనిషి కొనుగోలు చేసేలా హరిత నిర్మాణాలు ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం లాంటిదని అభివర్ణించారు. ఇక్కడ అనుకూల వాతావరణం, నీటి వసతి, నిరంతర విద్యుత్ సరఫరా, కావలసినంత భూమి, శాంతిభద్రతలు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం పూర్తయితే తెలంగాణ కొత్త రూపుదిద్దుకుంటుందన్నారు. జిల్లాలను, అక్కడి ఉత్పత్తులను హైదరాబాద్‌కు అనుసంధానం చేయడంలో ఆర్‌ఆర్‌ఆర్ తోడ్పడుతుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్, ఓఆర్‌ఆర్ మధ్య పారిశ్రామిక క్లస్టర్లు నిర్మిస్తామన్నారు.
వీటి మధ్య పెద్దఎత్తున పరిశ్రమలు రానున్నాయని, ఫలితంగా వేలాదిమంది కార్మికులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతంలో నివసించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)తో భాగస్వామ్యం కావడం ఆనందకరమన్నారు. ఐజీబీసీ 2001 నుంచి దేశంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సె్‌ప్టకు నాయకత్వం వహించి, 11.67 బిలియన్ చదరపు అడుగుల నిర్మాణ లక్ష్యం సాధించడం అభినందనీయమన్నారు. మన రాష్ట్రంలో 1.46 బిలియన్ చదరపు అడుగుల మేర నిర్మాణం జరగడం, 2.50 లక్షల నివాసాలకు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికెట్ పొందడం పెద్ద ముందడుగన్నారు. ప్రభుత్వం హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీ సదుపాయాలు కల్పిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజుల్లో 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉంటుందని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.