Share News

Governor: మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:10 AM

రాష్ట్రంలో పథకం ప్రకారం దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. జాతి వ్యతిరేక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నాయంటూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు బీజేపీ ఫిర్యాదు చేసింది.

Governor: మత విద్వేషాలు  రెచ్చగొట్టే కుట్ర

  • పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు

  • కేసులు ఎన్‌ఐఏకు అప్పగించాలి

  • గవర్నర్‌ జిష్ణుదేవ్‌కు బీజేపీ ప్రతినిధుల విజ్ఞప్తి

  • సమగ్ర విచారణకు డీజీపీ జితేందర్‌కు వినతి

  • నిఘా వ్యవస్థ పూర్తి విఫలం: ఈటల

  • స్లీపర్‌సెల్స్‌ కుట్ర ఛేదించాలి: రఘునందన్‌

  • లాఠీచార్జి అమానుషం: రాజాసింగ్‌

  • హిందువులపై అక్రమ కేసులు: వీహెచ్‌పీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పథకం ప్రకారం దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని.. జాతి వ్యతిరేక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నాయంటూ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆలయాలపై వరుస దాడుల కేసుల దర్యాప్తును ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)కు అప్పగించాలని డీజీపీని ఆదేశించాలని కోరింది. ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌, కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు వినతిపత్రం అందజేశారు. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనతో పాటు జాతి వ్యతిరేక కార్యక్రమాలపై ఒక హోటల్‌లో శిక్షణ పొందిన వారిపై సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు.


ముత్యాలమ్మ గుడిపై దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ చేపట్టిన హిందూ యువతపై అక్రమ కేసులు పెట్టారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇటు డీజీపీ జితేందర్‌ను కూడా బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. ఆలయాలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. పలు కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దాడికి పాల్పడ్డవారికి మతిస్థిమితం లేదంటూ ముందే ప్రకటించడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఈటల ఆరోపించారు. హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆలయాల మీద బయట నుంచి వచ్చిన కొంతమంది దుర్మార్గులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన వ్యక్తులు పక్కనే ఉన్న హోటల్లో శిక్షణ పొందారు. దాడి చేసిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే మతిస్థిమితం లేని వాడంటున్నారు.


హైదరాబాద్‌లో ఇట్లాంటి 15 బృందాలు శిక్షణ పొంది హిందూ మనోభావాలు దెబ్బకొట్టే దుర్మార్గ కుట్ర చేస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం జరుగుతుందని తెలిసినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. లుంబినీపార్క్‌, గోకుల్‌ చాట్‌ వద్ద పేలుళ్ల ఘటనలను ఇంకా మర్చిపోలేదు. మళ్లీ అలాంటి కుట్రకు ఈ దుర్మార్గులు తెరలేపే అవకాశముందని గవర్నర్‌కు తెలియజేశాం’ అని ఈటల వివరించారు. 3 నెలల్లో 15 ఆలయాలపై దాడులు జరిగాయని, వీటిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డీజీపీని కోరినట్లు రఘునందన్‌రావు తెలిపారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ పేరిట సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు స్లీపర్‌సెల్స్‌ కుట్ర పన్నాయని, దీన్ని ఛేదించాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాలపై దాడుల ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముత్యాలమ్మ గుడి వద్ద హిందూ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేయడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. దీని దృష్ట్యా అడ్వకేట్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కోరారు.


  • గవర్నర్‌కు వీహెచ్‌పీ ఫిర్యాదు..

ముత్యాలమ్మ ఆలయం వద్ద శాంతియుత ఆందోళన చేసిన హిందూ యువకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని గవర్నర్‌కు వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. ఆ అక్రమ కేసులను ఎత్తివేసేందుకు ఆదేశాలివ్వాలని, లాఠీచార్జ్‌ చేసిన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోరింది. ఈ మేరకు వీహెచ్‌పీ ప్రతినిధులు రామరాజు, సునీతారామ్మోహన్‌రెడ్డి, పగుడాకుల బాలస్వామి తదితరులు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Oct 22 , 2024 | 04:10 AM