BJP: కాంగ్రెస్‌కు ఏటీఎంలా ‘మూసీ పునరుజ్జీవం’
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:20 AM
‘‘మూసీ పునరుజ్జీవం’’ ప్రాజెక్టును కాంగ్రెస్.. ఏటీఎంలా వినియోగించుకోవాలనుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం:బండి సంజయ్
నేడు ఇందిరా పార్కు వద్ద బీజేపీ మహాధర్నా
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ పునరుజ్జీవం’’ ప్రాజెక్టును కాంగ్రెస్.. ఏటీఎంలా వినియోగించుకోవాలనుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఎలా అడ్డగోలు దోపిడీకి పాల్పడిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే కాంగ్రెస్ సర్కారు తంటాలు పడుతోందని.. ఈ పరిస్థితుల్లో మరో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
‘‘నాబార్డ్ ఇచ్చిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. ఇది, జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువ. దేశంలోనే అత్యధికం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కానీ ప్రజలపై మోయలేని అప్పులు మోపి, పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదు’’అని సంజయ్ పేర్కొన్నారు. మూసీ బాధితులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ధర్నాచౌక్ వద్ద బీజేపీ నిర్వహిస్తున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.