Kishan Reddy: అల్లు అర్జున్‌పై కక్షసాధింపు: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:18 AM
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీఅధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
అల్లు అర్జున్‌పై రాష్ట్ర సర్కారు కక్షసాధింపు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రేవంత్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
బన్నీ ఇంటిపై దాడి ఘటనలో నలుగురు కొడంగల్‌వాసులు: డీకే అరుణ
హైదరాబాద్ సిటీ, విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుచర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీఅధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందని ఆరోపించారు. కాగా.. బెనిఫిట్ షోలు, రేట్ల పెంపు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే (విశాఖ ఉత్తర) విష్ణుకుమార్ రాజు అన్నారు.
గతంలో ప్రజలకు ఉపయోగపడే పనులకు అవసరమైన నిధుల సేకరణ కోసమే బెనిఫిట్ షోలకు అనుమతించేవారని, ఇప్పుడు నిర్మాతల లాభాల కోసం, రేట్లు పెంచి ఇస్తున్నారని.. అది తగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక.. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. దాడికి పాల్పడినవారిలో నలుగురు కొడంగల్‌వాసులు ఉన్నారని.. వారిలో ఒకరు కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేశారని తెలిపారు. ఆ పార్టీ నేతలే ఈ దాడి చేయించారనే అనుమానం కలుగుతోందని ఆమె ధ్వజమెత్తారు.