Share News

Telangana Politics: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యల కలకలం..

ABN , Publish Date - Jun 22 , 2024 | 07:28 AM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు.

Telangana Politics: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ వ్యాఖ్యల కలకలం..
Raja Singh and Etela Rajendar

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు ఎంపీల్లో నలుగురు పేర్లు రాష్ట్ర అధ్యక్షుడి పదవి రేసులో వినిపిస్తున్నాయి. మెదక్ ఎంపీ రఘునందన్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈటలకు బీజేపీ (BJP) తెలంగాణ శాఖ బాధ్యతలు అప్పగిస్తారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ సంస్థాగత మార్పుల్లో భాగంగా కొత్త జాతీయ అధ్యక్షుడితో పాటు వివిధ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తారని.. దీనిలో భాగంగా తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్షుడి పోస్టు కోసం చాలామంది ప్రయత్నిస్తున్నప్పటికీ.. సామాజిక సమీకరణలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈక్రమంలో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది.

Kishan Reddy: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..


రాజాసింగ్ ఏమన్నారంటే..

బీజేపీ తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడిగా దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ కోరారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధ్యక్షుడి ఎంపిక జరగాలని.. 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోవాలని రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఓ వైపు ఈటలను అధ్యక్షుడిగా నియమిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సుదీర్ఘకాలం బీఆర్‌ఎస్‌లో ఉన్న ఈటల రాజేందర్ 2021లో బీజేపీలో చేరారు. వామపక్ష భావజాలం కలిగిన ఈటల తన రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీలో చేరారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తుండటంతో.. ఆయన పరోక్షంగా ఈటల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఖాళీ..


రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక..

ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన వ్యక్తుల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనుకుంటే ధర్మపురి అర్వింద్‌కు ఇవ్వాలని రాజాసింగ్ కోరుతున్నట్లు ఆయన వ్యాఖ్యల ఆధారంగా తెలుస్తోంది. అర్వింద్ 2019 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. మరోవైపు హిందుత్వ భావజాలం కలిగిన అర్వింద్‌కు రాజాసింగ్ మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సి ఉంది.


Sircilla: పదేళ్ల రాష్ట్ర ప్రగతిపై బురదచల్లడం మానాలి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jun 22 , 2024 | 07:28 AM