Share News

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:08 AM

ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.

BJP: రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

  • రైతులకిచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటాడతాం

  • అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారికే దగా

  • కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకుల ధ్వజం

  • హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద రైతుదీక్ష ప్రారంభం

  • రేవంత్‌రెడ్డి.. మరో గజినీ అయ్యావా: మహేశ్వర్‌రెడ్డి

  • ముఖ్యమంత్రికి అధికారం తలకెక్కింది: ఎంపీ ఈటల

  • రైతులను కాంగ్రెస్‌ ముంచుతోంది: విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌/కవాడిగూడ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది. ముఖ్యంగా రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేవరకూ వదలిపెట్టబోమని హెచ్చరించింది. బీఆర్‌ఎ్‌సలాగే మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని కుండబద్ధలు కొట్టింది. లక్షలాది మంది రైతాంగానికి అండగా ఉంటామని ప్రకటించింది. రూ.2 లక్షల రుణమాఫీకి ఆంక్షలెందుకు విధించారని నిలదీసింది. రైతుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. వారినే దారుణంగా మోసం చేస్తోందని మండిపడింది. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.


కాంగ్రె్‌సకు హైదరాబాద్‌ నగరంలో ఓట్లు రాలేదని.. అందుకే ఇక్కడ పేదల ఇళ్లను కూల్చుతోందని ధ్వజమెత్తింది. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని, రూ.15 వేల రైతు భరోసా వెంటనే అందించాలని, రైతు కూలీల ఖాతాల్లో రూ. 12 వేలు జమచేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు సోమవారం ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్‌లో రైతు హామీల సాధన దీక్ష చేపట్టారు. ఈ ఆందోళన మంగళవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి.. గజినీ అయ్యావా..? రైతులకు ఇచ్చిన హామీలు మరచిపోయావా..? మరచిపోయినట్లు నటిస్తున్నావా..? రైతుల కోసం ఏటా రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించింది వాస్తవం కాదా..? 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ కోసం రూ.40వేల కోట్లు అవసరమని మీరే ప్రకటించి.. తీరా రూ.17వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది నిజం కాదా..?’’ అని నిలదీశారు.


కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటేనే రేవంత్‌కు రైతులు ఓట్లేశారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. గతంలో కేసీఆర్‌ కూడా అలవికాని హామీలివ్వడం ద్వారా అడ్రస్‌ లేకుండా పోయారని తెలిపారు. కేసీఆర్‌కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేడేళ్లు పడితే.. రేవంత్‌కు మూడు నెలలు కూడా పట్టలేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హామీల అమలుకు రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలాగే కాంగ్రెస్‌ కూడా రైతులను నిండా ముంచుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా రైతుల బతుకులు మారలేదన్నారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ ఎప్పుడు చేస్తారని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఎవరి కోసం హైడ్రాతో హడలెత్తిస్తున్నారని రేవంత్‌ను ప్రశ్నించారు.


  • 80% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు: అర్వింద్‌

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 80 శాతం మంది రైతులకు పంగనామాలు పెట్టిందని ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. కేసీఆర్‌ది రాచరిక పాలన అయితే కాంగ్రె్‌సది అరాచక పాలన అని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేసిందో.. పది నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అంత మోసం చేసిందని ఎంపీ రఘునందన్‌విమర్శించారు. అధికారంలోకి వస్తే కేసీఆర్‌ అవినీతిపై హైకోర్టు సిటింగ్‌ జడ్జి చేత విచారణ జరిపిస్తామని నాడు ప్రకటించిన మీకు.. ఇప్పుడు సిటింగ్‌ జడ్జి దొరకడం లేదా? అని సీఎం రేవంత్‌ను నిలదీశారు.

Updated Date - Oct 01 , 2024 | 04:08 AM