Bandi Sanjay: హైడ్రాతో వసూళ్లపర్వం..
ABN , Publish Date - Oct 01 , 2024 | 03:59 AM
అయ్యప్ప సొసైటీలో అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే.. హైడ్రా కూల్చివేతల పేరుతో కాంగ్రెస్ పాలకులు సంపన్నుల నుంచి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
మూసీ సుందరీకరణ పేరుతో లక్షన్నర కోట్ల అవినీతికి శ్రీకారం
పేదోళ్ల ఇళ్లను కూల్చితే ఊరుకోం: బండి సంజయ్
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 30: అయ్యప్ప సొసైటీలో అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే.. హైడ్రా కూల్చివేతల పేరుతో కాంగ్రెస్ పాలకులు సంపన్నుల నుంచి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే.. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి కాంగ్రెస్ అవినీతికి తెరతీస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమాల్లో సంజయ్ పాల్గొన్నారు.
పారను చేతబట్టి చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వమే అనుమతులిచ్చి.. ఇప్పుడు ఇళ్లను కూల్చివేస్తే ఎలా అని ప్రశ్నించారు. వారం రోజుల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైడ్రాపై పోరాట కార్యాచరణను రూపొందించి, అమలు చేయబోతున్నామని సంజయ్ తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో సంజయ్ సోమవారం భవానీ దీక్ష స్వీకరించారు.