Share News

Bandi sanjay: హైడ్రా కొరివితో ప్రభుత్వం తల గోక్కుంటోంది

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:01 AM

హైడ్రా అనే కొరివితో కాంగ్రెస్‌ పార్టీ తల గోక్కుంటోందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

Bandi sanjay: హైడ్రా కొరివితో ప్రభుత్వం తల గోక్కుంటోంది

  • కూల్చివేతలకు నిరసనగా త్వరలో చలో హైద్రాబాద్‌

  • జగన్‌ అబ్దుల్‌ కలాం కంటే తోపా? రాష్ట్రపతి

  • హోదాలోనే కలాం తిరుమలలో డిక్లరేషన్‌ ఇచ్చారు

  • జగన్‌.. లడ్డూను కల్తీ చేసినట్టే ఉంది: బండి

నార్సింగ్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హైడ్రా అనే కొరివితో కాంగ్రెస్‌ పార్టీ తల గోక్కుంటోందని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. హైడ్రా కూల్చివేతలతో ప్రజల కన్నీళ్లు, ఆర్తనాదాలు మీకు గుర్తుకు రావడం లేదా? ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మళ్లీ పేదల ఇళ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారా? అని రేవంత్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో ఇళ్లు కూల్చడం, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోవడం, మాజీ సర్పంచులుకు బిల్లుల బకాయిలే కాంగ్రెస్‌ కొంపముంచుతాయన్నారు. కూల్చివేతలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు నిరసనగా త్వరలో చలో హైదరాబాద్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.


బండ్లగూడ జాగీర్‌లో శ్రీ విద్యారణ్య నూతన భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ చుట్టు పక్కల ఉన్న పేద హిందువుల ఇళ్లను కూల్చివేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైందని ఆరోపించారు. మలక్‌పేట రేసు కోర్సు నుంచి ముసారాంబాగ్‌ వరకు మూసీ స్థలాలను ఓవైసీ అనుచరులు కబ్జాలు చేశారని, వాటిని టచ్‌ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కాగా తిరుమల డిక్లరేషన్‌ అంశంపై ఏపీ మాజీ సీఎం జగన్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.


హిందూయేతరులు తిరుమలకు వస్తే డిక్లరేషన్‌ ఇవ్వాలనే నిబంధన ఎప్పట్నుంచో అమల్లో ఉందని, కొత్తగా కనిపెట్టిందేమీ కాదన్నారు. డాక్టర్‌ అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకునేందుకు వచ్చి డిక్లరేషన్‌ సమర్పించారని, అబ్దుల్‌ కలాం కంటే జగన్‌ ఎక్కువా? అని ప్రశ్నించారు. గతంలో జగన్‌ హిందువుల ఓట్ల కోసమే తిరుమల వెళ్లినట్లు అనిపిస్తోందన్నారు. జగన్‌ తీరు చూస్తుంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు అనిపిస్తోందన్నారు. దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పడం సిగ్గుచేటన్నారు. దళితులను అడ్డుపెట్టుకొని జగన్‌ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని.. ఆయన తీరు ముమ్మాటికీ హిందూత్వపై జరుగుతున్న దాడిలో భాగమేనన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 04:01 AM