Bonalu Festival: వైభవంగా గోల్కొండ బోనాలు..
ABN , Publish Date - Jul 08 , 2024 | 03:42 AM
భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.
శ్రీ జగదాంబిక ఆలయంలో ఉత్సవాలు షురూ.. పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్, మంత్రులు
నార్సింగ్/కవాడిగూడ/కార్వాన్, జూలై 7 (ఆంద్రజ్యోతి): భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూ జలు చేశారు. ఈ ఉత్సవాలకు గవర్నర్ సి.వి.రాధాకృష్ణన్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు టి.ప్రకా్‌షగౌడ్, దానం నాగేందర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ ఎంపీ హనుమంతురావు, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఆలయ కమిటీ సభ్యులతోపాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు.
అంతకుముందు చోటాబజార్‌లో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారి అనంతచారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. లంగరహౌజ్ నుంచి భారీ అడుగుల తొట్టెల ఊరేగింపు, చోటాబజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గోల్కొండ కోటపై గల శ్రీ జగదాంభిక (గోల్కొండ ఎల్లమ్మ) అమ్మవారి ఆలయం వరకు ఊరేగించారు. మరోపక్క బంజారా దర్వాజ నుంచి పటేల్ లక్ష్మమ్మ ఇంటి నుంచి మొట్ట మొదటి బోనం దేవాలయం వరకు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. కుతుబ్‌షాహీ కాలం నుంచి చోటాబజార్‌లోని ఆలయ పూజారి అనంతచారి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహం, బంజారాదర్వాజ పటేల్ లక్ష్మమ్మ ఇంటి నుంచి మొదటి బోనం సమర్పించండం ఆనవాయితీగా వస్తోంది. ఇక ప్రతి ఆదివారం, గురువారం గోల్కొండ కోటలో ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండలోని గల శ్రీజగదాంబిక అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. ఆదివారం ఒక్కరోజే రెండు లక్షలకు పైగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది.
ఘనంగా కుమ్మర్ల బోనాల జాతర
బోనాల పండుగ సందర్భంగా మట్టికుండల్లోనే బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించేలా త్వరలోనే జీవో తీసుకొచ్చి అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌లు హామీ ఇచ్చారు. ఆషాఢ మాసం బోనాల పండగ సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జగదీష్ మందిర్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం వరకు కుమ్మర్ల బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.