‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన ఇంకా స్పృహలోకి రాని శ్రీతేజ్
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:05 AM
సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
చిక్కడపల్లి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఇంకా స్పృహలోకి రాలేదని కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని, శుక్రవారంలో పోల్చితే కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకునే స్థితికి వచ్చాడన్నారు. జ్వరం తగ్గిందని, రక్తప్రసరణ మెరుగుపడిందని చెప్పారు. ఇదిలా ఉండగా.. తొక్కిసలాట ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ తెలిపారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ జరుగుతోందన్నారు. కాగా, ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి(35) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె మృతిపట్ల నటుడు అల్లు అర్జున్ శుక్రవారం సంతాపాన్ని తెలిపారు. రూ. 25లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీతేజ్ వైద్యఖర్చులు సైతం భరించనున్నట్లు ప్రకటించారు.
సాదలేక ముగ్గురు కొడుకులను అమ్మిన తల్లి
ఆర్మూర్‌టౌన్, డిసెంబరు 7 (ఆంరఽధజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో తన ముగ్గురు కొడుకులను సాదలేక విక్రయించింది ఓ కన్నతల్లి. ఇందుకు సుమారు 4 లక్షల వరకు తీసుకుంది. అయితే నగదు అయిపోవడంతో మళ్లీ డబ్బులు డిమాండ్ చేసి కటకటాల పాలైనఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన సంగెం భాగ్యలక్ష్మీకి ముగ్గురు కుమారులు. ఐదేళ్ల క్రితం భర్తతో విడిపోయి అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గత కొంతకాలంగా భాగ్యలక్ష్మీకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో 10 నెలల క్రితం తన ముగ్గురు కొడుకులను వేర్వేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు విక్రయించింది. సుర్బిర్యాల్ గ్రామానికి చెందిన గంగాధర్‌కు ఏడేళ్ల కుమారుడిని రూ.లక్షకు, జగిత్యాలకు చెందిన వనజకు ఐదేళ్ల కొడుకుని రూ.2 లక్షలకు, భీమ్‌గల్ మండలం బెజ్జోర గ్రామానికి చెందిన నర్సయ్యకు రూ.లక్ష 20వేలకు మూడో కుమారుడిని విక్రయించింది. అయితే ఆ డబ్బులు అయిపోవడంతో సంతానాన్ని విక్రయించిన వారికి ఫోన్ చేస్తూ మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై పిల్లలను తీసుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు శనివారం భాగ్యలక్ష్మీ, అలాగే పిల్లలను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.