Share News

BRS: కౌశిక్‌రెడ్డి అరెస్టు.. హైడ్రామా!

ABN , Publish Date - Dec 06 , 2024 | 03:09 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు.

BRS: కౌశిక్‌రెడ్డి అరెస్టు.. హైడ్రామా!

  • ఉదయమే కౌశిక్‌ నివాసానికి హరీశ్‌

  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • అనంతరం కౌశిక్‌ రెడ్డి, 20 మంది కార్యకర్తల అరెస్టు

  • అరెస్టులు అక్రమం: కవిత

  • హరీశ్‌ అరెస్టు నిరసనగా సిద్దిపేటలో రేవంత్‌ దిష్టిబొమ్మ దహనం

  • నేడు నెక్లస్‌ రోడ్డులో నిరసనలు

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం/బంజారాహిల్స్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని గురువారం బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు ముందు, తర్వాత హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ రెడ్డి అరెస్టును అడ్డుకొనేందుకు కొండాపూర్‌లోని ఆయన నివాసానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలను వచ్చినవారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్టు చేశారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతోందని.. ఇందుకు సీఎం రేవంత్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌ రెడ్డి కారణమని ఫిర్యాదు చేసేందుకు బుధవారం కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్‌ ఠాణాకు చేరుకున్నారు. అదే సమయంలో సీఐ రాఘవేంద్ర తన వాహనంలో బయటకు వెళుతున్నారు. గమనించిన కౌశిక్‌రెడ్డి తన కారుతో సీఐ వాహనాన్ని అడ్డుకున్నాడు. తన ఫిర్యాదు స్వీకరించాలని కోరారు. ముఖ్యమైన పనిమీద బయటకు వెళుతున్నానని స్టేషన్‌లో మిగతా సిబ్బందికి ఫిర్యాదు ఇవ్వాలని సీఐ సమాధానమిచ్చినా కౌశిక్‌రెడ్డి వినిపించుకోలేదు. ఆయనతో వాగ్వావాదానికి దిగారు. దీనిపై సీఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు బీఎన్‌ఎ్‌స 57,126(2), 127(2), 132, 224, 333, 451(3), 191(2) రెడ్‌ విత్‌ 190,3(5) కింద కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం పోలీసులు భారీ బందోబస్తుతో కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను, మరో 20 మంది బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అంతకుముందు... విషయం తెలియడంతో కౌశిక్‌రెడ్డి ఇంటికి హరీశ్‌ రావు వెళ్లారు. మీ దగ్గర ఎఫ్‌ఐఆర్‌ ఉందా? నోటీసులు ఇచ్చారా? అని పోలీసులను హరీశ్‌ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ ఉన్నందున నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ చూపించాలని అడగగా.. ప్రస్తుతం తమ దగ్గర లేదని చెప్పిన పోలీసులు అక్కడి నుంచి హరీశ్‌ను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కౌశిక్‌ ఇంటివద్ద హరీశ్‌ అభిమానులు ఆందోళన చేయడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఇక కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి రాగా వారినీ పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. హరీశ్‌ అరెస్టు విషయం తెలియడంతో పార్టీ శ్రేణులు అక్కడికి తరలివచ్చాయి. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని స్టేషన్‌ ముందు బైఠాయించారు. కాగా గచ్చిబౌలి పీఎ్‌సలో ఉన్న హరీశ్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు తరలివచ్చారు.


ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాగంటి గోపినాథ్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు హరీశ్‌ను కలిశారు. రాయదుర్గం పోలీస్‌ష్టేషన్‌లోని జగదీశ్వర్‌రెడ్డిని పలువురు నేతలు కలిశారు. హరీశ్‌ను కలిసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కౌశిక్‌రెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు. ఉదయం నుంచి అరగంటకో సెక్షన్‌ మారుస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా, ఎర్రబెల్లి మాట్లాడుతూ రేవంత్‌ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు నేరవేర్చడంలో విఫలమయ్యారని, దానిని ప్రశించినందుకు బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాగా హరీశ్‌ అరెస్టును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దహనం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి, సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, హరీశ్‌ అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఇందుకు నిరసనగా శుక్రవారం నెక్ల్‌సరోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టేందుకు బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.


  • సైకో, ఫ్యాక్షనిస్టులా రేవంత్‌ తీరు

  • పగ, ప్రతీకారంతో విపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్నారు: హరీశ్‌

హైదరాబాద్‌ సిటీ: ’సీఎం రేవంత్‌ రెడ్డి సైకోలా, ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారు. పగ, ప్రతీకారంతో శాడిస్టిక్‌ ప్రెషర్‌తో పని చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టేందుకు లక్ష్యం చేసుకుంటున్నారు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు పోలీ్‌సస్టేషన్లలో నమోదు కావడం లేదని, గాంధీభవన్‌లో తయారు చేస్తున్నారని విమర్శించారు. గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. మార్పు.. మార్పు.. అన్న రేవంత్‌.. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వమూ నిలబడదనే సంగతి సీఎం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులూ గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన నడుస్తోందని విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడినైన తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారని.. మరి, తెలంగాణలో వాళ్ల పార్టీ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? అని మండిపడ్డారు. రేవంత్‌ను బాగుచేయాలని, లేదంటే సీఎంను మార్చాలని రాహుల్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏడాదిలో ఎన్నడైనా కేసీఆర్‌ పేరేత్తకుండా మాట్లాడారా?మీరు బూతులు తిడితే మేం భరించాలా? మీకు సూచనలివ్వాలా? అని రేవంత్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, 12 గంటలైనా మెజిస్ట్రేట్‌ ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిని విడుదల చేసే వరకు నిద్రపోమని, ఆయనకు అండగా ఉంటామన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 03:09 AM