KTR:దావోస్‌లో అదానీతో రేవంత్ అలయ్ బలయ్
ABN , Publish Date - Jan 18 , 2024 | 03:17 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదానీ దోచిన డబ్బులు ప్రధాని మోదీ, బీజేపీకి వెళతాయని రేవంత్ రెడ్డి అన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు దావోస్‌లో అదానీతో సీఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ తీసుకుంటున్నారని విమర్శించారు.
మహబూబ్ నగర్: కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) మండిపడ్డారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో గురువారం నాడు పాల్గొన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అదానీ దోచిన డబ్బులు ప్రధాని మోదీ, బీజేపీకి వెళతాయని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు దావోస్‌లో అదానీతో సీఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ తీసుకుంటున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలో లేని సమయంలో అదానీ దేశానికి శత్రువు అయ్యారు. ఇప్పుడు అదే అదానీతో ఎందుకు పనిచేస్తుందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ ఆదేశాలతో అదానీతో రేవంత్ రెడ్డి కలిసి పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కేటీఆర్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తమ వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందని విమర్శించారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకోకపోవడం అని కేటీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని శ్రేణులను కేటీఆర్ కోరారు. పార్టీలో అన్నిస్థాయిల్లో కమిటీలను వేస్తామని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని వివరించారు. ఎన్నికల్లో గెలిచిన సమయంలో పొంగిపోలేదు.. ఓడిపోతే కుంగిపోము అని మాజీమంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.